తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో అందరిదీ ఒకదారి అయితే సి.ఎల్.పి.ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఒక్కరిదీ మరోదారి. ఆయన పార్టీ ముఖ్యసమావేశాలకు హాజరుకారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిని లెక్క చేయరు. ఆ పదవి తనకు ఇస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపిస్తానని చెపుతుంటారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయన మాటలను ఏమాత్రం పట్టించుకోదు. ఆయనతో సహా అందరూ ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలోనే పనిచేయాలని విస్పష్టంగా చెపుతుంటుంది. అయినా కోమటిరెడ్డి తీరు మారినట్లు కనబడదు.
నల్లగొండ పట్టణంలో బుధవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఏదో ఒక రోజున నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకం నాకుంది. అప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో పరుగులు తీయిస్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఏమీ చేయడం లేదు. తెరాస సర్కార్ ను ప్రశ్నించే గొంతులను ఆయన నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనసాగుతోంది. వచ్చే ఎన్నికలతో అది సమాప్తం కాబోతోంది,” అని అన్నారు.
ఈ సందర్భంగా అయన తన నియోజకవర్గంలో చేసిన చేయబోతున్న పలు అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. రూ.700 కోట్ల వ్యయంతో బ్రాహణంవెల్లంల నిర్మాణపనులు పూర్తయితే మర్రిగూడ చెరువుకు నీరు వస్తుందని, దానితో చుట్టుపక్కల గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఇంకా ఇటువంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
కోమటిరెడ్డికి పిసిసి అధ్యక్ష పదవిని ఇవ్వడానికే కాంగ్రెస్ అధిష్టానం విముఖత చూపిస్తున్నప్పుడు ఇక ఆయన ఏవిధంగా ముఖ్యమంత్రి అవుదామని కలలు కంటున్నారో ఆయనకే తెలియాలి. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపిస్తూనే రూ.700 కోట్ల వ్యయంతో బ్రాహణంవెల్లంల నిర్మాణపనులు జరుగుతున్నాయని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. ఆ పనులకు తెరాస సర్కార్ శ్రీకారం చుట్టి వాటికి నిధులు మంజూరు చేస్తేనే జరుగుతున్నాయి తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన జేబులో నుంచి తీసి ఖర్చు చేయడం లేదు.
ఎమ్మెల్యే నిధులలో రూ.7లక్షలు పెట్టి సిసి రోడ్ల నిర్మాణం, హైమాక్స్ లైట్ల ఏర్పాటు చేస్తున్నానని స్వయంగా చెప్పుకొంటున్నప్పుడు తెరాస సర్కార్ ఏమీ చేయడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ తెరాస సర్కార్ ఆయన జిల్లా, నియోజకవర్గానికి కూడా బారీగా నిధులు అందిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నప్పుడు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించడం అర్ధరహితం.