కర్నూలు జిల్లాలో నంద్యాల ఉపఎన్నికలు తెదేపా, వైకాపాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రెండు పార్టీలు చాలా ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారంలో జగన్ తన గురించి తాను చెప్పుకొంటున్న మాటలను విని అందరూ నవ్వుకొనేలా చేస్తున్నాయి.
నిన్న రోడ్ షోలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాకు చంద్రబాబు నాయుడులాగ ముఖ్యమంత్రి పదవి లేదు. డబ్బు లేదు. లేనిదీ ఉన్నట్లుగా..ఉన్నది లేనట్లుగా చూపే న్యూస్ పేపర్, మీడియా కూడా లేవు. ఆడినమాట తప్పని విశ్వసనీయత, ధర్మం కోసం పోరాడే శక్తి మాత్రమే నాకున్నాయి. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నాకిచ్చిన గొప్ప ఆస్తి ఈ విలువలే. ఈ పెద్ద కుటుంబమే. ఇవే నాకున్న గొప్ప ఆస్తులు. వైకాపాను గెలిపించండి ధర్మాన్ని గెలిపించండి,” అని అన్నారు.
ఆయన తన ప్రసంగంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా నంద్యాల ప్రజలను ఏవిధంగా మోసం చేస్తున్నారో సోదాహరణంగా వివరించారు. అది వేరే సంగతి. వారిరువురిలో ఎవరిని నమ్మవచ్చనేది ప్రజలే నిర్ణయిస్తారు. కానీ జగన్ తనకు లేని గుణాలను ఉన్నట్లుగా, ఉన్న ఆస్తులను, మీడియా లేనట్లుగా చెప్పుకోవడమే విడ్డూరంగా ఉంది.
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా జరుగుతున్న సమయంలో కర్ర విరగకుండా.. పాము చావకుండా..అన్నట్లుగా ‘తెలంగాణా సెంటిమెంటు’ను గౌరవిస్తానని చెప్పిన జగన్, రాష్ట్ర విభజన అనివార్యం అని గ్రహించగానే తెలంగాణాలో తన పార్టీ నేతలను, కార్యకర్తలను నడిరోడ్డుపై విడిచిపెట్టి ఏపికి వెళ్ళిపోయి సమైక్య శంఖారావం పేరిట ఉద్యమాలు చేశారు.
వాటితో ఏపిలో ప్రజలను ఆకట్టుకొని అధికారంలోకి రావాలనుకొన్నారు. కానీ ఆ భూటకపు ఉద్యమాల వలననే ఆయన విశ్వసనీయత దెబ్బతింది. ఏపిలో ప్రజలు తిరస్కరించారు. తెలంగాణా ప్రజలకు ఆయన దూరం అయ్యారు . మళ్ళీ ప్రత్యేకహోదా కోసం భూటకపు ఉద్యమాలు చేసి తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు.
ఇక తన మసాక్షిని, కోర్కెలను, పార్టీ ఆలోచనలను ప్రతిబింబించే సాక్షి మీడియా ఎవరిదో అందరికీ తెలుసు. కానీ తనకు మీడియా లేదని ధైర్యంగా చెప్పుకోవడం జగన్ కే చెల్లునేమో?
ఇక అక్రమాస్తుల కేసులను ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళి వచ్చిన జగన్ తన పార్టీకి ఓటేస్తే ధర్మానికి ఓటేసినట్లు చెప్పడం, తన వద్ద ఆస్తులు లేవని చెప్పుకోవడం మరో వింత.
“నాకు చంద్రబాబు నాయుడులాగ ముఖ్యమంత్రి పదవి లేదు,” అని చెప్పుకోవడం అతనికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఎంత బలంగా ఉందో స్పష్టం చేస్తోంది. జగన్ కు లేనిది విశ్వసనీయతే కానీ అదే పుష్కలంగా ఉందని బలంగా నమ్ముతున్నారు. ప్రజలను కూడా నమ్మమని చెపుతున్నారు. మరి నంద్యాల ప్రజలు నమ్ముతారో లేదో త్వరలోనే తెలుస్తుంది.