ధర్నా చౌక్ పరిరక్షణ కోసం రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ పోరాటాలు చేసి అలసిపోయి చేతులు ఎత్తేశాయి కానీ టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాత్రం తన పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు.
ఏపికి ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో పోరాడకుండా చంద్రబాబు నాయుడుతో పోరాడుతున్నట్లే, ధర్నా చౌక్ కోసం కోదండరామ్ తెరాస సర్కార్ తో పోరాడే బదులు డిల్లీ వెళ్ళి అక్కడ దీక్షలు చేయడానికి సిద్దపడుతుండటం చాలా ఆశ్చర్యం, అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఈనెల 21న జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు డిల్లీలో వరుసగా జేయేసి కార్యక్రమాలు ఉంటాయని వాటిలో తెరాస సర్కార్ మూడేళ్ళ పాలనపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయని దసరా తరువాత హైదరాబాద్ లో బారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకొని మాట్లాడుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించడం లేదని ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అరెస్టులు చేయిస్తోందని అన్నారు. లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నేరెళ్ళ బాధితులను పరమార్శించడానికి వచ్చినప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించిందని ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు.
రాష్ట్రంలో నిర్బంద, నిరంకుశ పాలన సాగుతోందని, దానిని తప్పకుండా ఎదిరిస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. డిల్లీ యాత్ర ముగించుకొని వచ్చిన తరువాత 5వ విడత అమరవీరుల స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు.
తెరాస సర్కార్ రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ “రాష్ట్రంలో ఏ పార్టీ సభలు నిర్వహించుకోకూడదు. ఏ పార్టీ తెరాసను సవాలు చేయకూడదు. తెరాస తప్ప రాష్ట్రంలో మరే పార్టీ ఉండకూడదు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు. విమర్శించకూడదు..” అన్నట్లుగా వ్యవహరిస్తుండటం వలన ప్రజలలో చాలా చెడ్డపేరు మూటగట్టుకొంటోంది. దీనిని తెరాస సర్కార్ అంగీకరించకపోవచ్చు కానీ ప్రజలలో ఈ అభిప్రాయం ఉన్నమాట వాస్తవం. దానినే ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారు ప్రతిబింబిస్తున్నారు.
అయితే తనకు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెపుతూనే ఒక ప్రతిపక్ష పార్టీ నేతలాగ ఆయన వ్యవహరిస్తుండటమే అనుమానాలకు తావిస్తోంది. ఆయన డిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ధర్నాచౌక్ రాదు కానీ తెరాస సర్కార్ పరువు గంగలో కలుస్తుంది. అదే ఆయన ఉద్దేశ్యమైతే ఆయనపై తెరాస నేతలు చేస్తున్న ఆరోపణలు ఆయనే స్వయంగా దృవీకరించుకొన్నట్లు అవుతుంది తెలంగాణా రాష్ట్రంలో ఎటువంటి మార్పురాదు. ఒకవేళ ఆయనకు రాజకీయాలలోకి రావాలనే కోరిక ఉన్నట్లయితే అదే విషయం ప్రకటించి తెరాస సర్కార్ తో ఎన్ని పోరాటాలు చేసినా ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ ధర్నా చౌక్ పేరుతో తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా డిల్లీలో పోరాటాలు చేయాలనుకోవడమే అభ్యంతరకరంగా ఉన్నాయి.