అది వారిపై ప్రేమా..లేక ఓటు బ్యాంక్ రాజకీయాలా?

August 16, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్రంలో ముస్లింలపై నిజంగా ప్రేమాభిమానాలున్నాయో లేక బలమైన వారి ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతుంటారో తెలియదు కానీ వారిపట్ల చాలా ప్రేమాభిమానాలు కురిపిస్తుంటారు. కారణాలు ఏవైనప్పటికీ అది అభినందనీయమే. 

ఆయన ముస్లింలకు ప్రస్తుతం ఉన్న 4 శాతం రిజర్వేషన్లని 12శాతానికి పెంచడానికి కొన్ని నెలల క్రితం శాసనసభలో ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. అయితే దానిని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసి తీర్మానం చేసి డిల్లీకి పంపించడం వలన ఏమి ప్రయోజనం? దాని అర్ధం ఏమిటి? అని ఆలోచిస్తే దానితో రాష్ట్రంలో ముస్లింలను ఆకట్టుకోవడానికి..రాష్ట్రంలో ఎప్పటికైనా తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగి అధికారం కైవసం చేసుకోవాలని కలలు కంటున్న భాజపాకు చెక్ పెట్టాడానికేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానిని పక్కన పెట్టి చూస్తే, రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి గత ప్రభుత్వాల కంటే తెరాస సర్కార్ కాస్త ఎక్కువ చేస్తోందని చెప్పవచ్చు. 

హైదరాబాద్ లో నిన్న జరిగిన హజ్ కమిటీ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, “సిఎం అంటే చీఫ్ మినిస్టర్ అని మాత్రమే అర్ధం కాదు..నేను మీ చీఫ్ సర్వెంట్ అని కూడా అర్ధం. రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం మా ప్రభుత్వం చాలా పధకాలు, కార్యక్రమాలు అమలుచేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ముస్లింల సంక్షేమం కోసం రూ.1,250 కోట్లు కేటాయించాము. అది చాలా తక్కవే అని తెలుసు. వీలైతే రూ.12,000 కోట్లు కేటాయించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. పేద ముస్లిం విద్యార్ధుల కోసం రాష్ట్రంలో 204 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాము. ఇంకా షాదీ ముబారక్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలుచేస్తున్నాము. గత 5 దశాబ్దాలతో పోలిస్తే ఈ మూడేళ్ళలో హైదరాబాద్ లో చాలా ప్రశాంత పరిస్థితులు నెలకొని ఉండటం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణా రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని హజ్ యాత్రికులు అల్లాను ప్రార్ధించవలసిందిగా కోరుతున్నాను,” అన్నారు కేసీఆర్. అనంతరం పచ్చ జెండా ఊపి హజ్ యాత్రను ప్రారంభించారు. 

నిజానికి రాష్ట్రంలో చాలా మంది ముస్లింలు దయనీయమైన జీవితం గడుపుతున్నారు. మజ్లీస్ పార్టీతో సహా అన్ని పార్టీలు వారిని ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయి. వారి విషయంలో తెరాస సర్కార్ కాస్త బాగానే వ్యవహరిస్తున్నట్లు కనబడుతుంది. అయితే వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఆ చర్యలు ఏమాత్రం సరిపోవని చెప్పక తప్పదు. అయితే దాని ఆర్ధిక, రాజకీయ పరిమితులు దానికీ ఉంటాయి కనుక కొంత అసంతృప్తి తప్పదు.


Related Post