ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజాం ప్రభువులన్నా..వారి పాలనన్నా చాలా ఇష్టం. అవకాశం దొరికినపుడల్లా దానిని బయటపెట్టుకొంటూనే ఉంటారు. మరోవిధంగా చెప్పాలంటే ఆయనకు నిజాం నవాబులే ఆదర్శంగా భావిస్తుంటారని చెప్పవచ్చు. బహుశః అందుకేనేమో ఆయనలో నవాబుల పోకడలు కనబడుతుంటాయి. నిజాం నవాబుల పట్ల తనకున్న అభిమానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ నిన్న హైదరాబాద్ లో తెలంగాణా హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మరోసారి బయటపెట్టుకొన్నారు.
“తెలంగాణాకు హైదరాబాద్ కు నిజాం నవాబు చాలా చేశారు. 1962లో భారత్-చైనా యుద్దసమయంలో ఆయన ఆరు టన్నుల బంగారాన్ని భారతప్రభుత్వానికి ఇచ్చారు. నిజాం నవాబులు ఆరోజుల్లోనే భారత్ నుంచి హజ్ యాత్రకు మక్కా వెళ్ళేవారి కోసం అక్కడ సత్రవలు (రుబాత్) నిర్మించారు. వాటిని తెలంగాణా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తెలంగాణా యాత్రికుల కోసం వినియోగిస్తున్నాము. కానీ నిజాం నవాబు గురించి తెలియనివారు ఆయనకు వ్యతిరేకంగా చిలువలు పలువలు కట్టుకధలు అల్లి ప్రచారం చేశారు. వాటిలో తెలంగాణా నుంచి హజ్ యాత్రకు వెళుతున్న 1284 మందికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నాము. మక్కాలోనే కాకుండా లండన్ మరియు పారిస్ లోని నిజాం నవాబుల ఆస్తుల రక్షణకు కూడా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆనాడు నిజాం నవాబు హైదరాబాద్ కు మేలు చేసినట్లుగానే నేను తెలంగాణా ప్రజల కోసం పోరాడి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించాను,” అని కేసీఆర్ చెప్పారు.