ఒకవైపు పాక్..మరోవైపు చైనా భారత్ పై దాడులు

August 16, 2017


img

భారతదేశం స్వాతంత్ర్య సంబరాలు జరుపుకొంటున్నవేళ ఒకవైపు పాకిస్తాన్ మరోవైపు చైనా భారత్ సరిహద్దులలో జవాన్లపై దాడులు చేశాయి. లడాక్ లోని పాంగ్యాంగ్ సరస్సు వద్ద భారత భూభాగంలో 5కిమీ లోపలగల ఫింగర్-4, 5అనే ప్రాంతాలలోకి నిన్న ఉదయం 6గంటలకు చైనా సైనికులు చొచ్చుకొని వచ్చారు. వారిని ఇండో-టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ (ఐటిబిఎస్) దళాలు అడ్డుకోగా చైనా సైనికులు వారిపై రాళ్ళతో దాడి చేశారు. ఐటిబిఎస్ సైనికులు కూడా రాళ్ళతో ఎదురుదాడి చేశారు. సుమారు మూడు గంటలపాటు హోరాహోరీగా జరిగిన ఆ రాళ్ళయుద్ధంలో ఐటిబిఎస్ ఇరు పక్షాల సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. భారత్ దళాలు గట్టిగా త్రిప్పికొట్టడంతో చైనా సైనికులు మూడు గంటల తరువాత వెనక్కు తిరిగివెళ్ళిపోయారు. 

సిక్కిం సరిహద్దు వద్ద భారత్-చైనా-భూటాన్ ట్రై-జంక్షన్ వద్ద డొక్లాం వద్ద గత రెండు నెలలుగా భారత్-చైనా సైన్యాలు ఎదురెదురుగా నిలిచి ఉన్నాయి. భారత్ తక్షణమే తన సైనికులను వెనక్కు తీసుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాలసి ఉంటుందని చైనా బెదిరిస్తున్నా భారత్ వెనక్కు తగ్గలేదు. అక్కడ డొక్లాం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొని ఉండగా నిన్న లడాక్ లో చొరబాటుకు ప్రయత్నించి భారత్ కు చైనా సవాలు విసిరింది. 

ఒకపక్క చైనా దురాక్రమణకు ప్రయత్నిస్తుంటే మరోపక్క పాకిస్తాన్ కూడా నిన్న కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో గత నాలుగైదు రోజులుగా కాల్పులు జరుపుతూనే ఉంది. ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటలకే కాల్పులు మొదలుపెట్టింది. పాక్ దాడులను భారత్ దళాలు గట్టిగా త్రిప్పి కొడుతున్నాయి. 

భారత్ ఏనాడూ ఇరుగుపొరుగు దేశాలను ఆక్రమించుకోవాలని, వాటిని అస్థిరపరచాలని ప్రయత్నించలేదు. కానీ ధూర్తదేశాలైన చైనా,పాకిస్తాన్ లు నిత్యం చొరబాట్లకు ప్రయత్నిస్తూ భారత్ కు పక్కలో బల్లెంలాగ తయారయ్యాయి. భారత్ పై పాకిస్తాన్ ఇంతగా దాడులు చేస్తున్నా దానికి ఇచ్చిన “మోస్ట్ ఫేవర్డ్ నేషన్” హోదాను నేటికీ భారత ప్రభుత్వం రద్దు చేయలేదు. భారత్ కు చైనా నిత్యం ఈవిధంగా సవాళ్ళు విసురుతున్నప్పటికీ భారత ప్రజలకు, సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు చైనా వస్తువుల మీద మోజు తగ్గడం లేదు. మెడ్ ఇన్ చైనా మొబైల్స్, ఎలక్ట్రానిక్, గృహోపకరణాలను కొనుగోలు చేయడం మానుకోలేకపోతున్నారు. చైనాతో యుద్ధం చేయకుండా దానికి గట్టిగా బుద్ధి చెప్పాలంటే భారతీయులు అందరూ చైనా వస్తువులను కొనుగోలు చేయడం మానుకోవడమే సులువైన మార్గం.   



Related Post