బోరుబావిలో రెండేళ్ళ చిన్నారి

August 15, 2017


img

అదే నిర్లక్ష్యం... అదే ప్రమాదం మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో ఉమ్మడివరం అనే గ్రామంలో బోరుబావిలో రెండేళ్ళ చంద్రశేఖర్ అనే చిన్నారి బాలుడు పడిపోయాడు. ఆ సంగతి తెలియగానే జిల్లా కలెక్టర్, డిఎస్పి, ఎన్.జి.ఆర్.ఎఫ్. తదితర వైద్యసహాయ బృందాలు అక్కడికి చేరుకొని ఆ పిల్లాడిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పిల్లాడు బోరుబావిలో సుమారు 15 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

బోరుబావికి సమాంతరంగా పొక్లెయిన్ తో మరో గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. బోరుబావి చుట్టూ మెత్తటి మట్టి ఉన్నందున వేగంగా త్రవ్వకం పని కొనసాగుతోంది. మరొక గంటలోగానే బోరు బావిలో నుంచి పిల్లాడిని క్షేమంగా బయటకు తీసుకురాగలమని అధికారులు నమ్మకంగా చెపుతున్నారు. ఈలోగా బోరుబావిలో నుంచి పిల్లలను తీయడంలో అనుభవం ఉన్నవారిని విజయవాడ నుంచి అక్కడికి రప్పిస్తున్నారు. ప్రస్తుతం బోరుబావిలో పిల్లాడికి ఆక్సిజన్ సరఫరా అందిసున్నారు. 

ఈ మద్యనే అంటే జూన్ 22న వికారాబాద్ జిల్లాలో ఇక్కారెడ్డిగూడ గ్రామంలో చిన్నారి అనే 18 నెలల పాప ఆడుకొంటూ బోరుబావిలో పడిపోయింది. ఆమెను రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఆ సమయంలో తెరిచి వదిలేసిన బోరుబారులను మూసివేయడం గురించి మీడియాలో చాలా జోరుగా చర్చ జరిగింది. ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకొంది. అయితే ఆ సంఘటన కనువిప్పుగా భావించకపోవడంతో నేటికీ ఎక్కడో అక్కడ అభంశుభం తెలియని చిన్నారులు బోరుబావులలో పడి మరణిస్తూనే ఉన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రజలు, ప్రభుత్వం తెరిచి ఉంచిన బోరుబావులను మూసివేసేందుకు పూనుకొంటే ఇటువంటి విషాద సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు.  

ఈ బోరుబావి లోతు 40-50 అడుగులు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. సమాంతరంగా గొయ్యి త్రవ్వకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. కనుక చిన్నారి చంద్రశేఖర్ ప్రాణాలతో బయటపడే అవకాశాలున్నాయి. మరికొద్ది సేపటిలోనే అతనిని బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. 


Related Post