ఎప్పటికైనా పిసిసి అధ్యక్ష పదవి చేపట్టాలని కలలు కంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా పెద్ద షాక్ ఇచ్చారు.
ఈరోజు కుంతియా మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికల వరకు ఉత్తం కుమార్ రెడ్డే పిసిసి అధ్యక్షుడుగా కొనసాగుతారు. ఆయన నేతృత్వంలోనే మేము ఎన్నికలను ఎదుర్కొంటాము. ఆయన నేత్రుత్వాన్ని వ్యతిరేకిస్తే ఎంతవారైనా చర్యలు తప్పవు. ఉత్తం కుమార్ రెడ్డి పార్టీని బాగానే నడిపిస్తున్నారు. ఆయన పనితీరు పట్ల మా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సంతృప్తిగా ఉన్నారు. కనుక ఆయనను మార్చే ప్రసక్తి లేదు. కానీ వచ్చే నెలలో రాష్ట్రా స్థాయి పార్టీలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి. ఈసారి ఎన్నికలకు 6 నెలల ముందుగానే పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తాము. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతోను పొత్తులు పెట్టుకోవాలనుకోవడం లేదు. ఈ విషయంలో మా పార్టీ అధిష్టానందే తుది నిర్ణయం,” అని అన్నారు.
ఈ అక్టోబర్ నెలలోగా పిసిసి అధ్యక్షుడిని మార్చడం ఖాయం అని, తనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీని కోరినట్లు కోమటిరెడ్డి వెంకట రెడ్డి కొన్ని వారాల క్రితమే చెప్పుకొన్నారు. తనకు ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవులపై ఎటువంటి ఆశలులేవని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని చెప్పారు. అది ఉత్తం కుమార్ రెడ్డి వల్ల సాధ్యం కాదని కనుక తనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుకొంటున్నట్లు చెప్పారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అసమర్ధుడని, అతని నిర్వాకం వలననే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, కనుక అతనికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని తక్షణం తప్పుకొంటే మంచిదని ఇదివరకు ఒకసారి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇంతకు ముందు తెలంగాణా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్, ఇప్పుడు కుంతియా ఇద్దరూ కూడా ఉత్తం కుమార్ రెడ్డిని గట్టిగా సమర్ధించడమే కాకుండా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించే వారిపై చర్యలు కూడా ఉంటాయని గట్టిగా హెచ్చరిస్తున్నారు. మరి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇప్పుడు ఏమి చేస్తారో చూడాలి.