తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసే ముందు యూపిఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన ఐ.టి.ఐ.ఆర్.(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్) ప్రాజెక్టును మంజూరు చేసింది. దాని ద్వారా తెలంగాణాలో కొత్తగా ఐటి మరియు సంబంధిత పరిశ్రమల జరిగి సుమారు 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. దానికి కేంద్రప్రభుత్వమే అవసరమైన నిధులు అందజేయాలి.
తెలంగాణా ప్రభుత్వం దీని కోసం రూ.4,863 కోట్లతో కేంద్రానికి రెండు ప్రతిపాదనలు పంపించింది. వాటిలో మొదటి దశ ప్రాజెక్టు కోసం రూ.942 కోట్లు, రెండవ దశ కోసం రూ.3,921 కోట్లు ఉన్నాయి. 2013, నవంబర్ 13న మోడీ సర్కార్ ఆ రెండు ప్రతిపాదనలను కలిపి మొత్తం రూ. 3,275 కోట్లు మంజూరు చేయడానికి అంగీకరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో మొదటి దశకు రూ.165 కోట్లు, రెండవ దశకు రూ.3,110 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఐ.టి.ఐ.ఆర్. ప్రాజెక్టు నిధుల కోసం రాష్ట్ర అధికారులు, మంత్రి కేటిఆర్ స్వయంగా కేంద్రమంత్రితో, కేంద్ర ఐటి, ఆర్ధిక శాఖల అధికారులతో అనేకసార్లు సమావేశమవుతూ నిధుల విడుదల చేయాలని కోరుతూనే ఉన్నారు. కానీ కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఒక్క పైసా విదిలించలేదు.
కేంద్రప్రభుత్వం ఇంతవరకు నిధులు విడుదల చేయనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా అమలుచేస్తున్న ఐటి పాలసీ కారణంగా ఈ మూడేళ్ళలో రాష్ట్ర ఐటి రంగం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది.2016-17 సం.లలో రాష్ట్రం నుంచి 13.85 శాతం ఐటి ఉత్పత్తులు ఎగుమతులు సాధించింది. ఇది జాతీయ సగటు కంటే 4 శాతం ఎక్కువ.
ఇక 2013-14 లో రూ.56,258 కోట్ల విలువగల ఐటి ఉత్పత్తులు ఎగుమతి కాగా 2016-17 నాటికి అది రూ.85,470 కోట్లుకు చేరుకొంది. ఇక ఉపాధి కల్పన విషయంలో అదే కాలానికి 3,23,396 మంది నుంచి 4,31,891 కు చేరుకొంది. దీని వలన తెలంగాణా రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా తెలంగాణా ఐటి రంగం ప్రధాన ఆదాయవనరుగా నిలుస్తోంది. కేంద్రప్రభుత్వం ఐ.టి.ఐ.ఆర్.కు నిధులు మంజూరు చేసి ఉండి ఉంటే ఇది మరింత పెరిగి ఉండేదని వేరేగా చెప్పనవసరం లేదు. కానీ కేంద్రం ఈ ప్రాజెక్టును మంజూరు చేసి మూడేళ్ళుపైనే అయినప్పటికీ ఇంతవరకు నిధులు విడుదల చేయడం లేదు.
దీనిపై రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్ కేంద్ర ఐటి మంత్రి రవి శంకర్ ప్రసాద్ కు ఒక ఘాటు లేఖ వ్రాశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్ర ఐటి రంగానికి కేంద్రం నిధులు అందించి సహాయపడినట్లయితే కేంద్రానికి కూడా దాని వలన గణనీయంగా ఆదాయం పెరుగుతుందని కనుక తక్షణమే నిధులు విడుదల చేయాలని కేటిఆర్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. అసలు ఈ ఐ.టి.ఐ.ఆర్. ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా? లేకపోయినట్లయితే అదేవిషయం తెలియజేయాలని కేటీఆర్ తన లేఖలో కోరారు.
కేంద్రప్రభుత్వం తన ఆదాయపు లోటును భర్తీ చేసుకోవడానికి ఎయిర్ ఇండియా, ఓఎన్జిసి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో తన వాటాలను అమ్ముకోవడానికి సిద్దపడుతోంది. అదే..రాష్ట్ర ఐటిఐఆర్ ప్రాజెక్టు కోసం రూ.3,275 కోట్లు మంజూరు చేసి ఉండి ఉంటే, తిరిగి అంతకు అనేకరెట్లు ఆదాయం సమకూరి ఉండేది. కారణాలు ఏవైతేనేమి ఐటిఐఆర్ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయడం లేదు. అసలు చేస్తుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి కనిపిస్తోంది.