ఏప్రిల్ 2019లో సార్వత్రిక ఎన్నికలు జరుగవలసి ఉంది. వాటితోబాటే ఆంద్రా, తెలంగాణా, ఓడిశా రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరుగవలసి ఉంది. ఒకవేళ ఆ మూడు రాష్ట్రాలు అంగీకరించినట్లయితే 6 నెలలు ముందుగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నామని లోక్ సభ సెక్రెటరీ జనరల్ సుబాష్ సి కాశ్యప్ చెప్పారు. వచ్చే ఏడాది నవంబర్-డిశంబర్ నెలలో ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలున్నాయి. కనుక ఆంద్రా, తెలంగాణా, ఓడిశా రాష్ట్రాలు 6 నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్ళడానికి అంగీకరించినట్లయితే 2018 డిశంబర్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించినట్లయితే, ఇక నుంచి దేశంలో చాలా రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు సుబాష్ సి కాశ్యప్ చెప్పారు.
ఏపిలో తెదేపా-భాజపా మిత్రపక్షాలు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగుతున్నందున చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు అంగీకరించే అవకాశం ఉంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముందస్తు ఎన్నికలకు సానుకూలమే అన్నట్లు స్పందించారు. ఇక మిగిలింది ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఆయనను కూడా ఒప్పిస్తే 6 నెలల ముందుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.