కుంతియా గుడ్ స్టార్ట్!

August 14, 2017


img

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్ర కుంతియా హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా పార్టీ సీనియర్ నేతలు, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో వరుస సమావేశాలు నిర్వహించి పార్టీ పరిస్థితులను సమీక్షించారు. మొట్టమొదటి సమావేశంలోనే నేతల మద్య విభేదాలు, పార్టీలో ముఠాల గురించి మాట్లాడి ఇక నుంచి వాటిని మానుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. పార్టీలో బిసి సెల్ ఇండగా మళ్ళీ బిసి ఫోరం ఎందుకు స్థాపించవలసి వచ్చిందని కుంతియా ప్రశ్నించారు. దాని ఏర్పాటుకు బాధ్యులైనవారిపై చర్యలు తప్పవని కుంతియా స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చాలా సానుకూల వాతావరణం నెలకొని ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ అహాలను, అభిప్రాయభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అటువంటివారికి మాత్రమే వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు లభిస్తాయని కుంతియా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రభుత్వ ప్రజాప్రతిరేఖ విధానాలను, నిరంకుశ ధోరణి, దళితులపై దాడులు, కుంభకోణాలపై కాంగ్రెస్ నేతలు అందరూ కలిసికట్టుగా పోరాడాలని కుంతియా కోరారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తే దాని ఫలాలు తెలంగాణా ప్రజలకు దక్కడం లేదనె సంగతిని ప్రజలకు వివరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు, చేతలకు మద్య ఎక్కడా పొంతన లేదని, ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నారని అదే విషయం ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని కాంగ్రెస్ నేతలను కుంతియా కోరారు. వచ్చే ఎన్నికలలో మజ్లీస్ తో సహా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోబోమని కుంతియా స్పష్టం చేశారు. తెరాసను ఒంటరిగా డ్డీకొని గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని అందుకు తగ్గ వ్యూహాలు రచించుకొని ముందుకు సాగాలని కుంతియా కోరారు. ఒకవేళ అప్పటి పరిస్థితులను బట్టి అవసరమైతే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోదలిస్తే దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందని అన్నారు.

కుంతియా జోరు, తీరు చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం కల్పించడానికి శాయశక్తులా కృషి చేయబోతున్నట్లే కనిపిస్తున్నారు. మరి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన మాటలు వింటారో లేదో చూడాలి.   


Related Post