ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లోని గోరక్ పూర్ బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో గత రెండు వారాల వ్యవధిలోనే 60 మంది పసిపిల్లలు మృత్యువాత పడ్డారు. దానిపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి, మంత్రులు మాట్లాడుతున్న తీరు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వలన పిల్లలు చనిపోవడం లేదని ఎన్సీఫలీట్స్ అనే మెదడుకు సంబందించిన వ్యాధి కారణంగానే మరణిస్తున్నారని ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖా మంత్రులు వాదిస్తున్నారు. అదే నిజమనుకొంటే ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం విశేషం. ఈరోజు పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖాధికారులు ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సంస్థపై దాడి చేసి దానిని సీజ్ చేశారు.
ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వలన ఈ మరణాలు సంభవించలేదని ముఖ్యమంత్రితో సహా మంత్రులు వాదిస్తున్నప్పుడు మరి ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సంస్థపై ఎందుకు దాడులు నిర్వహించినట్లు? అని ఆలోచిస్తే అదే అసలు కారణమని అర్ధమవుతోంది.
ఈ సమస్యపై ముఖ్యమంత్రి యోగీ స్పందిస్తూ “ఉత్తర యూపిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాము. బహిరంగ మలవిసర్జన, పరిసరాలు, వ్యక్తిగత అపరిశుభ్రత వీటికి కారణాలుగా గుర్తించాము. ఈ సమస్య మూలాలు గుర్తించాము కనుక ఇక నుంచి వాటిని పరిష్కరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తాము,” అని యోగి చెప్పారు.
ఇది అంతుపట్టని వ్యాధి అని చెప్పిన ముఖ్యమంత్రి పిల్లల మరణాలకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ మిశ్రాను బాద్యున్ని చేస్తూ సస్పెండ్ చేయడం విశేషం. అసలు రాష్ట్రంలో ఇటువంటి తీవ్ర సమస్య ఒకటి ఉందనే సంగతి ఇంతమంది పసిపిల్లలు మరణించిన తరువాత కానీ ప్రభుత్వం దృష్టికి రాకపోవడం మరీ విచిత్రంగా ఉంది. వచ్చి ఉండి ఉంటే ఇంత అనర్ధం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. కానీ తీసుకోలేదు. ఇక ముందు తీసుకొంటామని ముఖ్యమంత్రి స్వయంగా చెపుతున్నారు. దీనిని బట్టి యూపి సర్కార్ ప్రాణాంతకమైన ఈ వ్యాధి పట్ల ఎంత ఆశ్రద్దగా వ్యవ్హరిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. కనీసం ఇప్పటికైనా యోగి సర్కార్ మేల్కొని యుద్దప్రాతిపదికన పిల్లల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకొంటే మంచిది.