బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ మహాదేవ్, ఆలయ అధికారులకు మద్య మొదలైన అంతర్గత వివాదాలు పతాకస్థాయికి చేరుకొన్నాయి.
ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ మహాదేవ్ సంప్రదాయాలకు విరుద్దంగా, ఆలయ అధికారులకు తెలియకుండా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పొరుగునే ఉన్న దేవరకొండకు తీసుకువెళ్ళి అక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు అన్ని టీవీ ఛానళ్ళలో ప్రముఖంగా వార్తలు రావడంతో ఈ వివాదం మొదలైంది.
మొదట ఆయన వాటిని ఖండించారు. ఆ తరువాత గుండె నొప్పి వచ్చిందని చెపుతూ రెండు రోజులు ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఉత్సవ విగ్రహం ఆలయంలో తన బీరువాలోనే ఉందని దానిని తాను ఆలయం బయటకు తీసుకువెళ్లలేదని, బయట వేరే విగ్రహం పెట్టి అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు. ఆలయ ఈవో తనపై కక్షకట్టి వేధిస్తున్నాడని, తనకు ఒకే నెలలో నాలుగు మెమోలు ఇవ్వడమే అందుకు ఉదాహరణ" అని చెప్పారు.
ఆలయ అధికారులు ఆయన బీరువాను, అందులోని అమ్మవారి విగ్రహాన్ని, ఆభరణాలను స్వాధీనం చేసుకొని ఆయనపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ సంగతి తెలుసుకొన్న అయన హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్దం అవ్వగా, ఆయన కంటే ముందుగా ఆలయ అధికారులు కోర్టులో కేవియట్ పిటిషన్ వేసి ఆయనను అడ్డుకొన్నారు.
ఈ వివాదం మొదలయ్యి ఇప్పటికి సుమారు 10 రోజులు కావస్తున్నా నేటికీ పరిష్కారం కాలేదు. సంజీవ్ మహాదేవ్ కు అధికారపార్టీ నేతలతో మంచి పరిచయాలు ఉన్నందునే ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఆలయ అధికారులు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి విచారణ జరిపించలేదని సమాచారం.