శ్రీరాం సాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంఖుస్థాపన సందర్భంగా తమ కాంగ్రెస్ నేతల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేసీఆర్ చేసిన విమర్శలకు సీనియర్ కాంగ్రెస్ నేత సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. శుక్రవారం కరీంనగర్ లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “అసలు ఈ మూడేళ్ళ పాలనలో మీ ప్రభుత్వం చేసినదేమిటి? మేము ఏ ప్రాజెక్టులను అడ్డుకొన్నామో కేసీఆరే స్వయంగా చెప్పాలి. ఆయనకు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాలను నిందించడం ఒక దురలవాటుగా మారింది. ఆరోజు రాజశేఖర్ రెడ్డి హయంలోనే శ్రీరాం సాగర్ వరద కాలువ, ఎల్లంపల్లి ప్రాజెక్టులను నిర్మించబట్టే వాటిని ఈరోజు మీరు మీ పునరుజ్జీవ పధకానికి వాడుకోగలుగుతున్నారు కదా? మరి ఆ విషయం చెప్పకుండా, తెలంగాణాకు మీరేదో కొత్తగా చేసేస్తున్నట్లు, మేము చాలా అన్యాయం చేశామని చెప్పుకోవడం ఎందుకు?
మేము నిర్మించిన ప్రాజెక్టులకు పేర్లు మార్చి, రీ డిజైనింగ్ పేరిట బారీగా ప్రజాధనం దోచుకొంటూ మళ్ళీ మా ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు. మేము చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు కాళేశ్వరం అని కొత్తపేరు పెట్టినంత మాత్రాన్న అది మీరు నిర్మించినట్లు అయిపోతుందా? రీ-డిజైనింగ్ పేరిట అక్రమంగా భూసేకరణ చేస్తూ రైతులను దోచుకొంటూ మళ్ళీ వాళ్ళను ఉద్దరిస్తున్నట్లు మాటలు చెపుతున్నది మీరు కాదా?
రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాం సాగర్ కు నీళ్ళు తీసుకువెళ్ళేటప్పుడు రెవెళ్ళ దగ్గర వరద కాలువ క్రాసింగ్ అవుతుందన్న సంగతి అసలు మీకు తెలుసా? ఒకసారి ఎస్.ఆర్.ఎస్.పి.కి నీళ్ళను తరలించి మళ్ళీ అదే నీటిని ఎల్.ఎం.డి.కి తరలించాలనుకోవడంలో ఏమైనా అర్ధం ఉందా? పునరుజ్జీవ పధకం పేరుతో అనవసరమైన పనులు చేపట్టి కాంట్రాక్టర్లకు డబ్బు దోచిపెట్టడమే తప్ప దాని వలన రైతులకు ఒరిగేదేమీ ఉండదని త్వరలోనే నిరూపితం అవుతుంది. మీ తప్పులను, లోపాలను కప్పి పుచ్చుకోవడానికి అనవసరంగా కాంగ్రెస్ పార్టీని నిందిస్తామంటే చూస్తూ ఊరుకోము,” అని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితులు, సాగునీరు ఉపలబ్దత, దానిని ఏవిధంగా సమర్ధంగా వినియోగించుకోవచ్చనే విషయాలపై సమగ్ర అవగాహన ఉంది. కనుక ఆయన సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి సాధికారికతతో మాట్లాడగలుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది సీనియర్ నేతలకు సాగునీటి ప్రాజెక్టులఫై మంచి అవగాహన ఉన్నప్పటికీ, వారు ఎందుకో మౌనం వహిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలే సాగునీటి ప్రాజెక్టులపై కోర్టులలో కేసులు వేస్తూ ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకొంటున్నారన్న తెరాస మంత్రుల ఆరోపణలపై కాంగ్రెస్ నేతల మౌనం తెరాస ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కనుక సాగునీటి ప్రాజెక్టులపై తెరాస వాదనలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ముందుకు రావలసిన అవసరం ఉంది. లేకుంటే ప్రజల ముందు కాంగ్రెస్ నేతలు దోషులుగా నిలబడక తప్పదు. అందుకు వారు వచ్చే ఎన్నికలలో మళ్ళీ మూల్యం చెల్లించక తప్పదని గ్రహించాలి.