మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీను వీడి తెరాసలోకి వెళ్ళిన తరువాత కోరుకొన్నట్లుగానే రాజ్యసభ సీటు సాధించుకొన్నారు కానీ తెరాసలో ఎన్నడూ ఆయన గొంతు వినపడింది లేదు. స్వేచ్చాస్వాతంత్ర్యాలకు నిలయమైన కాంగ్రెస్ పార్టీలో ఉండగా అయన నిత్యం మీడియాలో కనబడేవారు. అధికార, ప్రతిపక్ష పార్టీల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతుండేవారు. కానీ తెరాసలోకి వెళ్ళినప్పటి నుంచి ఆయన తన ఆ స్వేచ్చను కోల్పోయారు. నోటికి తాళం వేసుకోవలసివచ్చింది.
నిజానికి కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్ళిన నేతలందరిదీ ఇంచుమించు ఇదే పరిస్థితి. తెరాసలో ‘ఆ నలుగురు’ తప్ప మరెవరికీ స్వేచ్చగా మాట్లాడే అవకాశం లేదనేది బహిరంగ రహస్యమే. ఇటీవల జరిగిన నేరెళ్ళ ఘటనపై హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడవలసి ఉండగా దానిపై కేటిఆర్ మాట్లాడటం అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్చ తెరాసలో ఉండదని తెలిసి ఉన్నప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా కనబడుతున్నందునో లేక పదవులకు ఆశపడో తెరాసలో చేరారు. వారికి పదవులైతే లభించాయి కానీ తమ స్వేచ్చను కోల్పోయారని చెప్పక తప్పదు. ఆ కారణంగానే డి.ఎస్. త్వరలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగివచ్చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాటిపై ఆయన స్పందిస్తూ, “నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కొందరు రాజకీయ దురుదేశ్యంతో పుకార్లు పుట్టిస్తున్నారు. తద్వారా నా విశ్వసనీయతను దెబ్బ తీయాలని చూస్తున్నారు. నేను కాంగ్రెస్ నేతలను ఎవరినీ కలువలేదు. మళ్ళీ పార్టీలో చేరుతానని అడగలేదు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నాగురించి అటువంటి మాట అంటారని నేను భావించడం లేదు. నేను తెరాసను వీడేది లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదు. నాగురించి ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నవారు దానిని మానుకోకుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నాను,” అని అన్నారు.