టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేటి నుంచి నాలుగవ విడత తెలంగాణ అమరవీరుల స్ఫూర్తియాత్రను సికింద్రాబాద్ నుంచి ప్రారంభించారు. ఆయన యాత్ర ఉద్దేశ్యం తెరాస ప్రభుత్వ పాలనను, విధానాలలో లోపాలను ఎత్తిచూపుతూ విమర్శలు చేయడమేనని అందరికీ తెలుసు. కనుక తెరాసకు ఆగ్రహం కలగడం కూడా సహజమే. కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు మండలం బస్వాపూర్ లో ప్రొఫెసర్ కోదండరామ్ ప్రవేశిస్తుండగా కొందరు తెరాస కార్యకర్తలు ఆయనను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టిన తరువాత ప్రొఫెసర్ కోదండరామ్ మళ్ళీ తన యాత్రను కొనసాగించారు.
ఒకప్పుడు తెలంగాణా ఉద్యమాలలో ప్రొఫెసర్ కోదండరామ్ కు నీరాజానాలు పలికి ఆయనతో నేతృత్వంలో పోరాటాలు చేసిన తెరాస కార్యకర్తలు ఇప్పుడు ఆయన వస్తే అడ్డుకోవడానికి ప్రయత్నించడం శోచనీయం. ఆయన కూడా తెలంగాణా ప్రజల మేలుకోరుకొనే వ్యక్తే తప్ప శత్రువు కాదు. ఆయన ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు తప్ప తెలంగాణా రాష్ట్రాన్ని, ప్రజలను కాదు. ఆయన తెరాస సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తూ, విమర్శిస్తున్నారు కనుక ఆయనను తెలంగాణా శత్రువుగా చూడటం సరికాదు.
తెలంగాణా అంటే తెరాస లేదా తెరాస సర్కార్ కాదు. తెరాస కూడా మిగిలిన పార్టీలలాగే ఒక రాజకీయ పార్టీ. దానికి ప్రజలు అధికారం కట్టబెట్టారు కనుక దానితో విభేదిస్తే తెలంగాణాను వ్యతిరేకించినట్లు కాదు. ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని దాని విధానాలను వ్యతిరేకిస్తున్నారు కనుక ఆయనపై కాంగ్రెస్ ముద్రవేసి తెరాస నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నప్పుడు, ఆయన నోరు నొక్కే ప్రయత్నం చేయడం కంటే ఆయన అడుగుతున్న ప్రశ్నలకు తెరాస సర్కార్ సంతృప్తికరమైన సమాధానాలు చెపితే హుందాగా ఉండేది.
ఇక ప్రొఫెసర్ కోదండరామ్ కూడా తన ఈ అమరవీరుల స్ఫూర్తి యాత్రల ప్రదానోదేశ్యం, లక్ష్యం ఏమిటో స్వయంగా వివరిస్తే బాగుంటుంది. ప్రభుత్వ విధానాలను ఎండగట్టడమే ఉద్దేశ్యమైతే ఆ పని ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఒకవేళ వచ్చే ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించాలనే ఉద్దేశ్యం ఆయనకున్నట్లయితే ఆ విషయం ఇప్పుడే ప్రకటించి తదనుగుణంగా ముందుకు సాగినట్లయితే ఎవరూ ఆయనను వేలెత్తి చూపలేరు. ఏమైనప్పటికీ ఆయన విషయంలో తెరాస సర్కార్ కొంత సంయమనం పాటిస్తే హుందాగా ఉంటుంది.