కేసీఆర్ అందుకే డుమ్మా కొట్టారా?

August 11, 2017


img

శుక్రవారం ఉదయం 10 గంటలకు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని ముందు ప్రకటించారు. అందుకోసం గురువారం సాయంత్రం ఆయన డిల్లీ బయలుదేరవలసి ఉంది. కానీ ఆఖరు నిమిషంలో తన ప్రయాణం రద్దు చేసుకొన్నారు. అందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఎటువంటి కారణాలు తెలియజేయలేదు. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులపై జి.ఎస్.టి. విధింపుకు నిరసనగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడంలేదని తెలుస్తోంది. 

జి.ఎస్.టి.అమలులోకి రాకమునుపు దాని గురించి గొప్పగా వర్ణించి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు అందరూ ప్రాజెక్టు పనులపై జి.ఎస్.టి. విధింపును వ్యతిరేకిస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్దమని చెపుతున్నారు. ఈ కారణంగా ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోక తప్పదు. 

వెంకయ్య నాయుడి ఎన్నికకు మద్దతు పలికి ఈ కారణంతో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాకుండా వెళ్ళకపోవడం వలన రాష్ట్ర భాజపా నేతలు విమర్శించకుండా ఉండరు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వెళ్ళకుండా త్వరలోనే డిల్లీ వెళ్ళి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతోనే ఈ విషయంపై అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్టు పనులపై జి.ఎస్.టి. విధింపు వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత అదనపు భారం పడుతుందో లెక్కలు కట్టాలని మున్సిపల్, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి శాఖలు, సాగునీటి శాఖ, పంచాయితీ రాజ్, సివిల్ సప్లైస్, వైద్య, ఆరోగ్యశాఖల అధికారులను ఆదేశించారు. అ గణాంకాలను ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంచి ప్రభుత్వ పధకాలపై జి.ఎస్.టి.ని మినహాయించాలని లేదా నామమాత్రంగా చేయాలని కోరబోతున్నారు. 

అయితే ఇది కేవలం తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే ఉన్న సమస్య కాదు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఈ సమస్య ఉంది. కనుక కేంద్రం అంగీకరించవచ్చు లేదా నిరాకరించవచ్చు. కనుక దీనిపై తెలంగాణా ప్రభుత్వం ఒంటరిగా న్యాయపోరాటం చేయడం కంటే అన్ని రాష్ట్రాలను సంప్రదించి అందరూ కలిసి వచ్చే నెలలో జరుగబోయే జి.ఎస్.టి.కౌన్సిల్ సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి తేగలిగితే ఏమైనా ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది. లేకుంటే భాజపా వాదిస్తున్నట్లు రాజకీయ కారణాలతోనే దీనిపై వివాదం రాజేస్తున్నారనే విమర్శలు ఎదుర్కోకతప్పదు. 


Related Post