ఏపి సిఎం చంద్రబాబు నాయుడును వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా ద్వేషిస్తారని, ఆయనను ద్వేషించడమే తన పార్టీ విధానంగా మార్చుకొన్నారని అందరికీ తెలుసు కానీ ‘ఆయనను నడిరోడ్డుపై నిలబెట్టి తుపాకీతో కాల్చి చంపాలన్నంత కసి ఉందనే’ సంగతి మొన్ననే బయటపెట్టుకొన్నారు. దానిపై ఈసీ జగన్ కు నోటీసు ఇచ్చి వివరణ కోరగా, తాను ఆ ఉద్దేశ్యంతో అనలేదని అవి ఆవేదనతో అన్న మాటలేనని సంజాయిషీ చెప్పుకొన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడును శిక్షించేందుకు అధికారం, అవకాశం ఉండి ఉంటే అంతపని చేసి ఉండేవారని నిరూపిస్తున్నట్లుగా మళ్ళీ గురువారం అదేవిధంగా మాట్లాడారు.
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో అయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ మూడున్నరేళ్ళ పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. 2014 ఆగస్టు 15న కర్నూలులో చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. రైతులు, మహిళలు, నిరుద్యోగ యువకులను మోసం చేసిన చంద్రబాబు నాయుడికి ఉరిశిక్ష విధించినా తప్పు లేదు,’ అని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో అటువంటి మాటలు మాట్లాడవద్దని ఎన్నికల సంఘం హెచ్చరించిన రెండు రోజులకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈవిధంగా మాట్లాడటం గమనిస్తే చంద్రబాబు నాయుడు పట్ల ఆయన మనసులో ఎంత విద్వేషం ఉందో అర్ధం చేసుకోవచ్చు.
రాజకీయాలలో ఒక వ్యక్తిని మరొకరు, ఒక పార్టీని మరొకటి సైద్దాంతికంగా వ్యతిరేకించుకోవచ్చు కానీ హామీలు అమలుచేయనందుకు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బహిరంగంగా కాల్చి చంపాలి...ఉరి తీయాలి..అని పదేపదే ప్రజలకు చెప్పడాన్ని ఎవరూ హర్షించలేరు. పదేపదే ఆవిధంగా మాట్లాడటం వలన జగన్మోహన్ రెడ్డి తన గురించి ప్రజలకు దురాభిప్రాయం కలిగేలా చేసుకొంటూ తన పార్టీకి తనే నష్టం కలిగించుకొంటున్నారని గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జగన్ మాట్లాడుతున్న మాటలు ఆయనలో ఫ్యాక్షనిస్టుని పట్టి చూపిస్తున్నాయని తెదేపా నేతలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి గురించి ఇంత అనుచితంగా మాట్లాడినందుకు ఒకవేళ ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకొంటే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి..ఆయన పార్టీయే అని గ్రహిస్తే మంచిది.