నేరెళ్ళ ఘటన జరిగి ఇప్పటికి రెండు వారాలపైనే అయినా ఇంతవరకు పోలీసులు ఎవరి మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు. దళితులను శాశ్విత అంగవైకల్యం ఏర్పడేంతగా వారిని గొడ్డును బాదినట్లు బాదినా ఇంతవరకు భాద్యులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు. ప్రభుత్వం ఇంకా ఎందుకు ఉపేక్షిస్తోంది? అని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జరిగిన సంఘటనకు సిగ్గుపడకపోగా మంత్రి కేటిఆర్ అది దళితులపై జరిగిన దాడి కాదని సమర్ధించుకొంటూ మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. దళితులపై ప్రేమ ఒలకబోసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత జరిగినా ఈ ఘటనపై ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని ఉత్తం కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
రేపు అన్ని పార్టీల నేతలతో కలిసి వెళ్ళి గవర్నర్ నరసింహన్, డి.ఐ.జి.ల అనురాగ్ శర్మలను కలుస్తామని అన్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ లభిస్తే ఈ నెల 22,23 తేదీలలో డిల్లీకి వెళ్ళి ఆయనకు కూడా నేరెళ్ళ ఘటన గురించి పిర్యాదు చేస్తామని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు.
ఆగస్ట్ 15వ తేదీన హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిలపక్ష ధర్నా చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం భాద్యులపై చర్యలు తీసుకొని, భాదితులకు న్యాయం చేయాలని ఉత్తం కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే సిరిసిల్లాకు పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వతీరును ఎండగడతామని ఉత్తం కుమార్ రెడ్డి హెచ్చరించారు.
ఖమ్మం మిర్చి యార్డు కార్యాలయంపై కొందరు రైతులు దాడి చేసినప్పుడు, ప్రభుత్వం ఆఘమేఘాల మీద నివేదికలు తయారుచేయించి ఆ రైతులను జైలుకు పంపించింది. పోలీసులు వారి చేతులకు సంకెళ్ళు వేసి నడిరోడ్డు మీద నడిపించుకొంటూ కోర్టుకు తీసుకువెళ్ళారు. కానీ ఇప్పుడు నేరెళ్ళ ఘటనలో దళితులపై దాడి జరిగిందని తెలిసినా, వారు చిత్రహింసలకు గురయ్యారని కళ్ళకు కనబడుతున్నా దోషులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటం చాలా ఆశ్చర్యం, అనుమానాలు కలిగిస్తోంది. కనుక ఇకనైనా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే తెరాస ప్రజాగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే మంచిది.