ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం శుక్రవారంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలు తీవ్ర అభద్రతాభావంతో జీవిస్తున్నారని అన్నారు. ముస్లిం ప్రజల భారతీయతను సందేహించడం, దానిని పదేపదే నిరూపించుకొనే పరిస్థితులు కల్పించడం సరికాదని అన్నారు. నాతో సహా ముస్లింలు అందరు భారతీయులే. కనుక మన జాతీయవాదాన్ని రోజూ చాటుకోవలసిన అవసరం లేదని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో, కర్నాటక రాష్ట్రంలో ముస్లింలు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నట్లు వివిధ వర్గాల ద్వారా తాను తెలుసుకొన్నానని ఇదే విషయం ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చర్చించానని చెప్పారు. అయితే ప్రధాని మోడీ అప్పుడు ఏవిధంగా స్పందించారనే విలేఖరి ప్రశ్నకు అటువంటి విషయాలను బహిర్గతం చేయలేనని చెప్పారు. భారతదేశంలో శతాబ్దాలుగా పరమత సహహనం, శాంతి, అహింస అనే సూత్రాల ఆధారంగా ప్రజలు చాలా సఖ్యతతో నివసిస్తున్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి కనబడటం లేదని అన్నారు. భారతీయ జీవనవిధానాలను ఎవరూ విచ్చినం చేయాలని ప్రయత్నించకూడదని అన్నారు.
అన్సారీ వ్యాఖ్యలపై రేపు ఉపరాష్ట్రపతి చేపట్టబోతున్న వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న ఆయన అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని అన్నారు. నేటికీ దేశంలో అన్ని కులాలు, మతాల వారు స్నేహభావంతోనే జీవిస్తున్నారని అన్నారు. ఎప్పుడో..ఎక్కడో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలను భూతద్దంలో చూసి అభద్రతాభావానికి లోనవుతున్నారని అనడం సరికాదన్నారు.
ముస్లింలు అభద్రతాభావానికి లోనవుతున్నారని హమీద్ అన్సారీ ఏ ప్రాతిపదికన అన్నారో తెలియదు కానీ ముస్లిం దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్ ఇరాక్, సిరియా వంటి దేశాలలో కంటే భారత్ లో ముస్లింలు పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలతో జీవిస్తున్నారు. వారికి అన్ని రంగాలలో సమానావకాశాలు, సమాన హక్కులు అనుభవిస్తున్నారు. ఇక ముస్లింలపై అక్కడక్కడ దాడులు జరుగుతున్న మాట వాస్తవమే కావచ్చు. కానీ ముస్లింలపైనే కాదు..దళితులు, బలహీన వర్గాల ప్రజలు, మహిళలు, సామాన్య ప్రజలపై కూడా నిత్యం ఎక్కడో అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయనే సంగతి గమనించాల్సిన అవసరం ఉంది. వాటిని యావత్ జాతికి ఆపాదించిచూడటం సరికాదు.
నిజానికి భారత్ లో ముస్లింల తరపున ముస్లిం సంస్థలు, పార్టీల కంటే ఎక్కువగా సెక్యులర్ భావాలున్న హిందువులు, సెక్యులర్ పార్టీలే గట్టిగా పోరాడుతుండటం గమనించవచ్చు. ఏ సమస్యనైనా భూతద్దంలో నుంచి చూస్తే ఎవరికైనా అభద్రతాభావం కలుగకమానదు. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలను, లోపాలను మనం ఏవిధంగా అధిగమించి ముందుకు సాగిపోతున్నామో అదేవిధంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు కూడా అనివార్యమని గ్రహించి ముందుకు సాగిపోవడం చాలా అవసరం.
నలుగురైదుగురు ఉన్న ఒక కుటుంబ సభ్యుల మద్యనే భిన్నాభిప్రాయలు కనబడుతుంటాయి. అటువంటిది విభిన్న మతాలు, కులాలు, బాషలు, సంస్కృతులు కలిగిన 125 కోట్ల మంది ప్రజల మద్య భిన్నాభిప్రాయాలు ఉండకూడదనుకొంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండబోదు. భారత్ లో ఇంత భిన్నత్వం ఉన్నప్పటికీ అనేక శతాబ్దాలుగా అందరూ కలిసే జీవిస్తున్నారనే సంగతి అందరూ గుర్తుంచుకోవాలి.