హైదరాబాద్ లో ఒక ప్రభుత్వ కార్యాలయంపై పట్టపగలు ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో ఒక హోంగార్డు మృతి చెందాడు. మరొక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంత స్పష్టంగా ఉన్న ఈ కేసును ఒకటీ రెండేళ్ళు కాదు.. ఏకంగా 11 ఏళ్ళపాటు సుదీర్గ దర్యాప్తులు, న్యాయవిచారణ జరిగింది. కనుక దోషులకు శిక్ష పడుతుందని ఆశించడం సహజం. కానీ ఈకేసులో పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేని కారణంగా కేసు కొట్టివేయబడింది.
సరిగ్గా 11 ఏళ్ళ క్రితం అంటే 2006, అక్టోబరు 16న బంగ్లాదేశ్ కు చెందిన హుజీ అనే ఉగ్రవాద సంస్థ సభ్యుడు డాలి బేగంపేట వద్ద గల టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో సత్యనారాయన అనే హోంగార్డు మృతి చెందాడు. వెంకట్రావు అనే మరొక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరిపి మొత్తం 20 మందిని నిందితులుగా గుర్తించి వారిలో 10 మందిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. సుమారు 11 ఏళ్ళ సుదీర్గ విచారణ తరువాత ఆ కేసులో నిందితులను దోషులని నిర్ధారించేందుకు బలమైన ఆధారాలు ఏవీ లేని కారణంగా కేసును కొట్టి వేస్తున్నట్లు నాంపల్లి కోర్టు గురువారం తుది తీర్పు చెప్పింది. ఈ కేసులో అరెస్ట్ అయిన 10 మంది నిర్దోషులని పేర్కొంటూ వారిని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని తీర్పు చెప్పింది.
ఈ కేసు దర్యాప్తు, విచారణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఇంత సమయం, డబ్బు ఖర్చయినా పోలీసులు, న్యాయమూర్తులు శ్రమపడినా ఈదాడికి పాల్పడిన దోషులెవరో గుర్తించి శిక్షించలేకపోవడం విచారకరం. ఎవరూ దోషులు కాకపోతే మరి ఆత్మాహుతి దాడి చేసిందెవరు? దోషులను గుర్తించలేకపోయినందుకు ఎవరిని నిందించాలి?