జయలలిత ఆకస్మికంగా మరణించినప్పటి నుంచి నేటి వరకు కూడా తమిళనాడులో రాజకీయ అనిస్థితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం మద్య రాజీ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవడంతో, మద్యలో శశికళ మేనల్లుడు దినకరన్ ఎంట్రీ ఇచ్చి అన్నాడిఎంకె పార్టీపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని వాదిస్తున్నాడు. ఈలోగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కొత్త రాజకీయపార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటువంటి అనిశ్చిత రాజకీయ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె కూడా విఫలమైంది. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న భాజపా కూడా అయోమయంలో పడినట్లు కనిపిస్తోంది. ఒకసారి పళనిస్వామి వైపు మరోసారి పన్నీరు సెల్వం వైపు నిలబడి తెర వెనుక రాజకీయాలు చేస్తోంది తప్ప ప్రత్యక్షంగా ఏమీ చేయలేకపోతోంది.
కనుక ఈ అనిశ్చితిని తొలగించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు పళనిస్వామి చొరవ తీసుకొని పన్నీరు సెల్వం వర్గాన్ని కలుపుకుపోవడానికి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పన్నీరు వర్గం ప్రధాన డిమాండ్ అయిన దినకరన్ ను పార్టీ పదవులలో నుంచి తొలగిస్తూ అన్నాడిఎంకె పార్టీ ఈరోజు ఒక తీర్మానం చేసింది. కనుక ఇక పళనిస్వామి వర్గం మళ్ళీ పన్నీరు వర్గంతో చర్చలు ప్రారంభించడానికి సిద్దం అవుతోంది. పన్నీరు సెల్వంకు పార్టీ పగ్గాలు అప్పజెప్పి తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలని పళనిస్వామి భావిస్తున్నట్లు సమాచారం. అందుకు పన్నీరు అంగీకరించినట్లయితే అన్నాడిఎంకె పార్టీలో మళ్ళీ స్థిరత్వం ఏర్పడవచ్చు. కానీ పన్నీరు సెల్వం తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడితే మాత్రం మళ్ళీ సమస్య మొదటికి రావచ్చు. ఈ ఆగస్ట్ 15లోగా రెండు వర్గాలు విలీనం కావడానికి ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారైనా అన్నాడిఎంకెలో రెండు వర్గాలు విలీనం అవుతాయో లేదో చూడాలి.