ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ లో జరిగిన తెరాస ప్లీనరీ సభ కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు గులాబీ కూలీ పేరిట రకరకాల పనులు చేసి రాష్ట్రంలో వ్యాపారస్తులు, ఆసుపత్రులు, పారిశ్రామికవేత్తల నుంచి కోట్లాది రూపాయలు విరాళాలు సేకరించారు. తెరాస నేతలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దౌర్జన్యంగా అక్రమవసూళ్ళు చేశారని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖ, సీబీఐలకు లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు. గులాబీకూలీ పేరిట శ్రమదానం చేస్తున్నట్లు నటిస్తూ ప్రజల వద్ద నుంచి బలవంతపు వసూళ్ళకు పాల్పడిన తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులను ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని కోరారు.
గులాబీ కూలీ పేరిట తెరాస నేతలు, మంత్రులు విరాళాలు వ్యాపారస్తుల నుంచి సేకరిస్తున్నప్పుడే ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వారిలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు. కానీ ఆయన అప్పుడు పిర్యాదు చేయకుండా ఊరుకొని ఇన్ని నెలలు గడిచిన తరువాత ఇప్పుడు పిర్యాదు చేయడం వలన అది రాజకీయ ఉద్దేశ్యంతో చేసిందేనని అనుమానించవలసివస్తోంది. ఆయన ఏ ఉద్దేశ్యంతో పిర్యాదు చేసినప్పటికీ ఆ పిర్యాదులు అందుకొన్న సంస్థలు స్పందిస్తాయని ఆశించలేము.