నేరెళ్ళ ఘటనను తెలంగాణా ప్రభుత్వం ఎంత తక్కువగా చేసి చూపాలని ప్రయత్నిస్తున్నా అందరి చేత మొట్టికాయలు వేయించుకోక తప్పడం లేదు. హైకోర్టు కూడా ఈరోజు ఆ ఘటనపై చాలా ఘాటుగా స్పందించింది.
పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనవాజ్యంపై బుదవారం విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగ నాథన్, జస్టిస్ జె. ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంలో తెలంగాణా ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరించిందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
వరంగల్ ఎం.జి.ఎం.ఆసుపత్రికి చెందిన ఇద్దరు సీనియర్ వైద్యులను తక్షణమే వేములవాడ ఆసుపత్రికి పంపించి అక్కడ వైద్యచికిత్స పొందుతున్న నేరెళ్ళ బాధితులను ఆరోగ్యపరిస్థితిని పరీక్షించి వారం రోజులలోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఒకవేళ వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లయితే వారిని వెంటనే హైదరాబాద్ నిజాం ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగస్ట్ 16వ తేదీకి వాయిదా వేసింది.