మంత్రి కేటిఆర్ నేరెళ్ళ ఘటన గురించి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, కొందరు పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడం వలననే నేరెళ్ళ ఘటన జరిగిందన్నారు. ఆ సమాచారాన్ని స్థానికంగా ఉండే నేతలు తమకు అందించడంలో అశ్రద్ధ చూపడం వలన ఘటన జరిగిన సంగతి ఆలస్యంగా తమకు తెలిసిందని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామమని కేటిఆర్ అన్నారు. ప్రజలపై దాడులు చేయాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదని, జరిగిన దానికి తాము కూడా చాలా బాధపడుతున్నామని మంత్రి కేటిఆర్ అన్నారు. నేరెళ్ళ ఘటనను ఇసుక మాఫియాతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయాలని ప్రయత్నించడం చాలా హేయమైన చర్య అని అన్నారు. దళితులపై దాడుల విషయంలో కాంగ్రెస్ హయంలో జరిగినన్ని దాడులు మరెన్నడూ జరగలేదని అన్నారు. ఈ ఘటనపై డిఐ.జి నివేదిక చేతికి రాగానే భాద్యులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని మంత్రి కేటిఆర్ చెప్పారు.
ఈ సంఘటనను కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుగా గుర్తించి దానిపై గట్టిగా పోరాడింది. ఆ తరువాత కూడా ప్రభుత్వం తరపున ఎవరూ సానుకూలంగా స్పందించకపోగా ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేశారు. కనుక నేరెళ్ళ ఘటనపై మంత్రి కేటిఆర్ లేదా మరొకరో ఇప్పుడు ఎంతగా స్పందించినప్పటికీ తెరాసపై దళితుల ఆగ్రహం తగ్గడానికి చాలా కాలం పట్టవచ్చు. కనుక ఈలోగా తెరాస సర్కార్ బాధితులకు పూర్తి న్యాయం చేయగలిగితే వారు శాంతించవచ్చు.