పొన్నం తరువాత జగ్గారెడ్డి వంతు

August 09, 2017


img

తెలంగాణా కాంగ్రెస్ నేతలు అందరూ కూడబలుకొన్నట్లుగా రాజకీయంగా జోరు పెంచినట్లున్నారు. కరీంనగర్ లో వైద్య కళాశాల ఏర్పటు చేయాలని కోరుతూ మాజీ కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆగస్ట్ 5న మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన తరువాత మరో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. 

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి మూడేళ్ళు దాటినా ఇంతవరకు దాని గురించి ఆలోచనకూడా చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. కనుక మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్ట్ 15నుంచి కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లు జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు.   

 పొన్నం ప్రభాకర్ దీక్ష మొదలుపెట్టిన మూడు రోజులకే పోలీసులు భగ్నం చేశారు. జగ్గారెడ్డి చేయబోయే దీక్ష కూడా బహుశః అదేవిధంగా ముగియవచ్చు. ఇటువంటి దీక్షల వలన మెడికల్ కాలేజీలు ఏర్పాటుకావనే సంగతి వారికీ తెలుసు. కానీ వారి ఉద్దేశ్యం మెడికల్ కాలేజీ సాధించడం మాత్రమే కాదు. ఈ దీక్షల పేరిట హడావుడి చేసి ప్రజల దృష్టిలో పడటమే ప్రదానోదేశ్యంగా కనబడుతోంది. ఈ దీక్షల గురించి మీడియాలో బాగానే వార్తలు వచ్చాయి కనుక వారి ఆ ఉద్దేశ్యం నేరవేరినట్లే భావించవచ్చు. ఈ దీక్షలు ముగిసిన తరువాత మళ్ళీ వాళ్ళు మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి మాట్లాడుతారో లేదో చూసినట్లయితే ఈ సమస్యపై వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం చేసుకోవచ్చు.


Related Post