మళ్ళీ నోరుజారిన జగన్..ఈసీ నోటీసు జారీ

August 09, 2017


img

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి తన ముఖ్యమంత్రి కలలను భగ్నం చేసిన చంద్రబాబు నాయుడు అంటే ఎంత కోపమో అందరికీ తెలిసిందే. ఆయన ప్రతీమాటలో అది బహిర్గతం అవుతూనే ఉంటుంది. ఈనెల 3వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలనుదేశ్యించి మాట్లాడుతూ, “ ప్రజలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు. ఆయనను ముఖ్యమంత్రి కాదు ముఖ్యకంత్రీ అనాలి. ఆయనను సిఎం కాదు దొంగ అనాలేమో,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

ఒక ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చి చంపాలని ఎన్నికల సమయంలో ప్రజలను రెచ్చగొట్టినందుకు రాష్ట్ర ఎన్నికల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ జగన్మోహన్ రెడ్డిని సంజాయిషీ కోరుతూ నోటీసు పంపించారు. దానికి జగన్ సమాధానమిస్తూ, “అవి ఆవేదనతో అన్న మాటలే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా అన్నవి కావని వివరణ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసగిస్తున్నందునే తను ఆవేదనతో ఆవిధంగా అన్నానని సంజాయిషీ ఇచ్చుకొన్నారు. 

అయితే ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని జగన్ నోరుజారినందున వైకాపా నేతలు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “ నేను ఏమి నేరం చేశానని జగన్ నన్ను కాల్చి చంపాలనుకొంటున్నారు. నేను రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రిపగలు పనిచేస్తుంటే, మాకు జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. అధికారంలో లేనప్పుడే ఫ్యాక్షనిస్టులాగ వ్యవహరిస్తున్న జగన్ ఇక నిజంగా అధికారంలోకి వస్తే ఎలా వ్యవహరిస్తాడో? ఆ మాటలు అతనిలో ఫ్యాక్షనిస్టు భావాలకు అద్దం పడుతున్నాయి. అక్రమాస్తుల కేసులలో జైలుకు వెళ్ళివచ్చిన వ్యక్తి తన స్వార్ధ రాజకీయాల కోసం నన్ను కాల్చి చంపాలని కోరుకొంటున్నాడు. ప్రజలే అతనికి తగువిధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు. 

తెదేపా నేతలు కూడా జగన్ మాటలను హైలైట్ చేసి, అటువంటి ఫ్యాక్షనిస్టు భావాలున్న వైకాపాను ఓడించాలని ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చంద్రబాబు నాయుడుని రాళ్ళతో, చీపుర్లతో, చెప్పులతో తరిమికొట్టాలని ప్రజలను రెచ్చగొట్టేరు. ఈసారి ఏకంగా కాల్చి చంపమని నోరుజారి తమ పార్టీ విజయావకాశాలను తనే దెబ్బతీసుకొన్నారు. 


Related Post