ఆయన పార్టీ మరో ప్రజారాజ్యం కాబోతోందా?

August 09, 2017


img

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో రెండువారాలలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ఆయన సన్నిహితుడు తమిళరువి మణియన్ మీడియాకు తెలిపారు. తమిళనాడు ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా వారికి సేవ చేసేందుకే రజనీ రాజకీయాలలో రావాలనుకొంటున్నట్లు చెప్పారని మణియన్ చెప్పారు. పార్టీ ప్రకటన రోజునే పార్టీ పేరు, జెండా, అజెండా, ఆశయాలు, సిద్దాంతాలు మొదలైన అన్ని వివరాలను రజనీ స్వయంగా ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందించడమే తన ధ్యేయమని రజనీ చెప్పారని మణియన్ మీడియాకు తెలిపారు. 

రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాలలో వస్తానని గత 10-15 ఏళ్ళుగా చెపుతున్నారు. అప్పుడే ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి ఉంటే ఆయన అనుకొన్నవి సాధించడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ శూన్యత నెలకొని ఉన్నమాట నిజమే కానీ ఇప్పుడు రజనీ రాజకీయాలలో ప్రవేశించాల్సిన వయసు కాదు. రెండేళ్ళ క్రితం రజనీకాంత్ ఆరోగ్యం విషమించడంతో మృత్యువు గుమ్మం వరకు వెళ్ళి వెనక్కు తిరిగివచ్చారు. ఆ తరువాత ఆయన సినిమాలైనా చేయగలరో లేదో అని అందరూ అనుకొన్నారు. కానీ ఏడాదికి ఒక సినిమా చేయగలుగుతున్నారు. సినిమాల కంటే రాజకీయాలలో శ్రమ, ఒత్తిళ్ళు రెండూ ఎక్కువే. 66సం.లు వయసున్న రజనీకాంత్ వాటిని తట్టుకోగలరో లేదో చూడాలి.  

తమిళనాడు ప్రజలు ఆయనను ఒక గొప్ప హీరోగా అభిమానిస్తుండవచ్చు కానీ రాజకీయాలలో ప్రవేశిస్తే ఆదరిస్తారో లేదో అనుమానమే. ఎందుకంటే తమిళనాడులో అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలు ప్రస్తుతం కొంత బలహీనపడినప్పటికీ, వాటికున్న క్యాడర్, అనుభవం, శక్తిసామార్ధ్యాలు, ప్రజాధారణను తక్కువగా అంచనా వేయలేము. ఆ రెండు పార్టీలు కాకుండా రాష్ట్రంలో మరో అరడజను పార్టీలు కూడా ఉన్నాయి. కనుక రజనీకాంత్ వాటన్నిటినీ ఎదుర్కొని విజయం సాధించగలగాలి. గెలిచిన తరువాత వాటికి పూర్తి భిన్నమైన, పారదర్శకమైన పాలన అందించగలగాలి. అప్పుడే రజనీకాంత్ అసలైన విజయం సాధించినట్లు అవుతుంది. 

ఒకప్పుడు చిరంజీవి కూడా ఇదేవిధంగా తన శక్తిసామర్ధ్యలను ఎక్కువగా ఊహించుకొని ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఏడాదిలోగా మూసేసుకొన్నారు. ప్రజారాజ్యం వలన చిరంజీవి పొందింది ఏమీ లేదు కానీ ప్రజల దృష్టిలో పలుచనయ్యారు. చిరంజీవికి, రజనీకాంత్ కు చాలా విషయాలలో పోలికలు కనబడతాయి. ఒకప్పుడు అందరివాడిగా ఉన్న చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన తరువాత కొందరివాడిగా మారిపోయినట్లే, రజనీకాంత్ కూడా రాజకీయాలలో ప్రవేశిస్తే కొందరివాడిగా మారిపోవడం ఖాయం. చివరకు రజనీకాంత్ పార్టీ కధ కూడా ప్రజారాజ్యంలాగే ముగియవచ్చు.


Related Post