ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని మూడుచింతలపల్లి గ్రామంలో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈసారి ఆయన ప్రసంగంలో ఎటువంటి రాజకీయ ప్రస్తావన లేకుండా సాగడం విశేషం.
రాష్ట్రంలోని భూరికార్డుల గురించి వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖలు చెపుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని, కనుక మళ్ళీ సమగ్ర భూసర్వే చేయించబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. దీని కోసం 3 నెలలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. రైతులు అందరూ అధికారులకు సహకరించి తమ భూరికార్డులను సరిచేసుకోవలసిందిగా కేసీఆర్ కోరారు. ఈ రికార్డుల ఆధారంగానే వచ్చే ఏడాది మే-అక్టోబర్ నెలలలో రాష్ట్రంలో రైతులందరికీ ఎకరానికి రూ.4,000 చొప్పున రెండు పంటలకు కలిపి మొత్తం రూ.8,000 ఆర్ధిక సహాయం అందిస్తామని చెప్పారు. రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగవలసిన అవసరం లేకుండా కొరియర్ ద్వారా వారి ఇళ్ళ వద్దే అందించబోతున్నట్లు చెప్పారు.
తొలిదశ తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న కామిడి వీరారెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఆయన పేరిట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాదిలోగా లింగాపూర్ తండాతో సహా రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలను పంచాయితీలుగా మార్చబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
మూడుచింతలపల్లి, లింగాపూర్ తండాలకు చెరో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో గల 374 చెరువులను గోదావరి నీళ్ళతో నింపి 75 వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పారు. ఒక్కో ఇంటికి ఆరుచెట్లు పెంచిన వారికి వచ్చే ఏడాది రెండు పాడిఆవులను బహుమతిగా ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. శామీర్ పేట మండలానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా అనేక వరాలు ప్రకటించారు.