నేరెళ్ళ ఘటనలో దళితులపై పోలీసులు కేసులు నమోదు చేసి, వారి పట్ల క్రూరంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ నేతలు నిరసనలు, బహిరంగ సభ నిర్వహించతలపెట్టినప్పుడు తెరాస మంత్రులు వారిపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు తమ ప్రభుత్వంతో పోరాడేందుకు మరే ఇతర అంశం దొరకకపోవడం చేత రాజకీయ దురుదేశ్యంతోనే నేరెళ్ళ ఘటనపై హడావుడి చేస్తున్నారని మంత్రి కేటిఆర్ విమర్శించారు. కానీ ఆయనే స్వయంగా వేములవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 8మంది నేరెళ్ళ భాదితులను పరామర్శించి, జరిగిన దానికి విచారం వ్యక్తం చేయడం విశేషం.
నేరెళ్ళ ఘటనలో బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొంటామని బాధితులకు హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తాము ప్రజల పట్ల క్రూరంగా వ్యవహరించబోమని అన్నారు. ఇవి క్షణికావేశంలో జరిగిన సంఘటనలని కేటిఆర్ అన్నారు. నేరెళ్ళ ఘటనల వెనుక అధికార పార్టీకి చెందిన ఇసుక మాఫియా ఉండనే ఆరోపణలను మంత్రి కేటిఆర్ ఖండించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన ఇసుక సరఫరా విధానం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా వందల కోట్ల ఆదాయం వస్తుంటే, ఇసుక మాఫియా జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపించడాన్ని కేటిఆర్ తప్పు పట్టారు.
గతంలో ఖమ్మం మార్కెట్ యార్డు విద్వంసం కేసులో కూడా తెరాస సర్కార్ ఇదేవిధంగా వ్యవహరించి రైతుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. నేరెళ్ళ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టినప్పుడు దానిని రాజకీయంగా ఎదుర్కోవడానికే తెరాస ప్రయత్నించింది తప్ప కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఆ సమస్యను పట్టించుకోలేదు. కానీ నేరెళ్ళ ఘటన వలన దళితులు కూడా పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంటుందనే భయంతోనే నష్టనివరణ చర్యలలో భాగంగా ఎట్టకేలకు మంత్రి కేటిఆర్ భాదితులను పరామర్శించి ఈ సంఘటనపై స్పందించినట్లున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.