జి.ఎస్.టి.పై ఇప్పుడు యూ టర్న్ ఎందుకో..

August 08, 2017


img

జి.ఎస్.టి.వలన రాష్ట్రానికి, యావత్ దేశానికి చాలా ప్రయోజనం చేకూరుతుందని మెచ్చుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు జి.ఎస్.టి.పై ‘యూ టర్న్’ ఎందుకు తీసుకొన్నారని మాజీ కాంగ్రెస్ మంత్రి డికె అరుణ ప్రశ్నించారు. జి.ఎస్.టి.పై మాట మార్చినందుకు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ కూడా కేసీఆర్ ను విమర్శించారు. జి.ఎస్.టి.లో ఇసుక, కంకర, సిమెంట్, స్టీల్ పై 10 శాతం పన్ను తగ్గింది కనుక మిషన్ కాకతీయ, భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాల ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ కేసీఆర్ పెరుగుతుందని చెప్పడమే కాకుండా సుమారు 19 వేల కోట్లు అధనపు భారం పడుతుందని కేసీఆర్ ఏవిధంగా చెపుతున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేసీఆర్ కేవలం రాజకీయ దురుదేశ్యంతోనే జి.ఎస్.టి.పై న్యాయపోరాటం చేయాలని ఆలోచిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. అసలు ఏ ప్రాతిపదికన ప్రాజెక్టులపై జి.ఎస్.టి. విధింపు వలన నష్టాలు లెక్క కట్టారో చెప్పాలని నిలదీశారు. 

కేంద్రప్రభుత్వం జి.ఎస్.టి.బిల్లును ఆమోదించిన తరువాత అనేకసార్లు జి.ఎస్.టి. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించిందని, వాటికి రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారని, అప్పుడు జి.ఎస్.టి.ని మెచ్చుకొన్న కేసీఆర్ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఇంచుమించు ఇదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు. 

జి.ఎస్.టి.అమలులోకి వచ్చే ముందు మంత్రి ఈటెల దాని వలన రాష్ట్రాదాయం తగ్గిపోతుందని మీడియాతో చెప్పగా, జి.ఎస్.టి. వలన రాష్ట్రానికి దీర్గకాలిక లాభాలు ఉంటాయని కేసీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వాణిజ్యపన్నుల శాఖాధికారులు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్తులకు అవగాహనాకార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇప్పుడు ముఖ్యమంత్రే స్వయంగా జి.ఎస్.టి.పై అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లడటడం, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకొంటున్నట్లు చెప్పడం వలన ప్రజలకు, జి.ఎస్.టి.ని అమలుచేయాల్సిన అధికారులకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నట్లు అవుతోందనే ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. 


Related Post