మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సోమవారం ఒక ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి గురించి మనసువిప్పి మాట్లాడటం విశేషం.
“ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చాలా అనిశ్చితి నెలకొని ఉంది. ఇది ఎన్నికలలో వరుస ఓటముల వలన ఏర్పడిన అనిశ్చితి కాదు. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న అనిశ్చితి. కనుక కాంగ్రెస్ పార్టీ వీలైనంత త్వరగా ఈ పరిస్థితుల నుంచి బయటపడవలసి ఉంటుంది లేకుంటే పార్టీకి మళ్ళీ కోలుకోలేనంత తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి గతంలోనూ కొన్నిసార్లు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని అధిగమించి పార్టీ ముందుకు సాగినట్లే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించగలదు,” అని జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు.
“కాంగ్రెస్ నేతలు తాము ప్రధాని నరేంద్ర మోడీ-అమిత్ షాలను ఎదుర్కొంటున్నామని గ్రహించి అందుకు అనుగుణంగా సమిష్టి పోరాటం చేయవలసిన ఉంటుంది. వారిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుగా తన మూస ఆలోచనలను, మూస ధోరణుల నుంచి బయటపడి కొత్తగా ఆలోచించడం చాలా అవసరం లేకుంటే కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం ఉంది,” అని జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు.
“మోడీ-అమిత్ షాలను ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరివల్లో సాధ్యం కాదు. కాంగ్రెస్ నేతలందరూ సమిష్టి పోరాటం చేయవలసి ఉంటుంది,” అని అన్నారు. అంటే వారిరువురినీ ఎదుర్కోవడం రాహుల్ గాంధీ ఒక్కడి వలన కాదని జైరాం రమేష్ తేల్చి చెప్పినట్లే భావించవచ్చు.
“వచ్చే ఏడాదిలో కర్నాటకతో సహా మరికొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నందున ఈ ఏడాది చివరిలోగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి తక్షణం పార్టీని గాడిన పెట్టవలసిన అవసరం ఉంది. మోడీ పాలన పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో వరంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ కలలు కనడం సరికాదు,” అని జైరాం రమేష్ చెప్పడం విశేషం.
వచ్చే ఏడాది జరుగబోయే కర్నాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయపరంపర మళ్ళీ మొదలవుతుందని జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ భవిష్యత్ పట్ల జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన మాటలలో పార్టీ భవిష్యత్ పై అనుమానాలే ఎక్కువగా వినిపించడం ఆ పార్టీ వాస్తవపరిస్థితులను అద్దం పడుతున్నట్లున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఆ పార్టీ ముందుగా నాయకత్వ సమస్యను పరిష్కరించుకోవలసి ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆ పార్టీ అంగీకరించలేక వ్యతిరేకించలేని అయోమయపరిస్థితిలో ఉంది. కనుక ముందుగా ఆ సమస్యను పరిష్కరించుకోవలసి ఉంటుంది. అంతవరకు ఇతర సమస్యల గురించి ఆలోచించినా ప్రయోజనం ఉండకపోవచ్చు.