జి.ఎస్.టి.పై కేసీఆర్ అభ్యంతరాలు!

August 08, 2017


img

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏకీకృతపన్ను (జి.ఎస్.టి.) పన్ను విధానాన్ని ప్రతిపాదించినప్పుడు తెలంగాణా ప్రభుత్వం దానికి గట్టిగా మద్దతు పలికింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం వంటి ప్రజాప్రయోజన పనులను జి.ఎస్.టి.నుంచి మినహాయించాలని మొదటినుంచి కోరుతూనే ఉంది. ఈ ప్రాజెక్టులను జి.ఎస్.టి.నుంచి మినహాయించకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.19,500 కోట్ల ఆర్ధికభారం పడుతుంది. 

తమ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోకపోవడంతో ఈ సమస్యగురించి వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ వ్రాయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిశ్చయించుకొన్నారు. ప్రగతి భవన్ లో నిన్న సంబంధిత అధికారులతో సుదీర్గంగా చర్చించిన తరువాత లేఖలో పేర్కొనవలసిన అంశాలను సిద్దం చేశారు. ఈ లేఖపై ప్రధాని సానుకూలంగా స్పందించకపోయినట్లయితే, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిశ్చయించారు. 

ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “గతంలో జి.ఎస్.టి.ని అమలుచేయాలని చాలా దేశాలు ప్రయత్నించి, అది సాధ్యంకాక చివరకు ఉపసంహరించుకొన్నాయి. మన దేశంలో జి.ఎస్.టి.విజయవంతంగా అమలవ్వాలనే ఆశిద్దాం. దానిలో బయటపడుతున్న లోపాలను, సమస్యలను జి.ఎస్.టి. కౌన్సిల్ ఎంత త్వరగా పరిష్కరించగలదనే దానిపై జి.ఎస్.టి. విజయం ఆధారపడి ఉంటుంది. జి.ఎస్.టి. అమలులోకి రాకమునుపు మొదలుపెట్టిన ప్రజాప్రయోజన పనులను జి.ఎస్.టి. నుంచి మినహాయించాలని కోరుతున్నాము. కేంద్రప్రభుత్వం స్పందన బట్టి తగు నిర్ణయం తీసుకొంటాము,” అని చెప్పారు.  

రాష్ట్ర ప్రభుత్వం కోరిక సహేతుకంగానే ఉన్నప్పటికీ, ఈ విషయంలో తెలంగాణా రాష్ట్రానికి మినహాయింపునిస్తే దేశంలో మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఇటువంటి ప్రాజెక్టులకు కూడా మినహాయింపు ఇవ్వవలసి ఉంటుంది కనుక కేంద్రప్రభుత్వం అంగీకరించకపోవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ ఇదేకారణం చేత దాని విజ్ఞప్తిని తిరస్కరించబడవచ్చు. కనుక ఈ సమస్యను జి.ఎస్.టి. కౌన్సిల్ సమావేశంలో లేదా ప్రధాని నరేంద్ర మోడీతో నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవడమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది.   



Related Post