డ్రగ్స్ కేసులపై కాస్త హుందా పాటించండి సార్

August 03, 2017


img

డ్రగ్స్ కేసులతో తెలుగు సినీపరిశ్రమ తీరని అప్రదిష్టపాలయిన సంగతి తెలిసిందే. దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తూ సినీపరిశ్రమ ఒక బహిరంగలేఖ వ్రాసింది. 

తెలుగు సినీపరిశ్రమ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్రాసిన బహిరంగ లేఖను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ అధ్యక్షుడు పి.కిరణ్, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.మురళీమోహన్, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ తదితరులు నిన్న సాయత్రం మీడియాకు విడుదల చేశారు. 

దానిలో ఏమి వ్రాశారంటే.. తెలుగు సినీపరిశ్రమ కీర్తిప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయికి వ్యాపించి అత్యున్నత శిఖరాలు చేరుకొన్న ఈ సమయంలో ఈ డ్రగ్స్ వ్యవహారాలు, కేసులు దానికి కళంకం కలిగిస్తున్నాయి. మన సినీపరిశ్రమలో దాదా సాహెబ్ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందిన గొప్పవారున్నారు. అదేవిధంగా ఇటువంటి తప్పులు చేసేవారు కూడా ఉన్నారు. కొందరు చేసిన తప్పులకు యావత్ పరిశ్రమ మూల్యం చెల్లించవలసి వస్తోంది. అటువంటి వారిని సినీపరిశ్రమ ఎన్నడూ ఆదరించలేదు. అటువంటివారు కొంతకాలం తరువాత వారంతట వారే కనుమరుగయిపోతుంటారు. కానీ వారు చేసిన తప్పుల వలన సినీపరిశ్రమ పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతోంది. అది చంద్రగ్రహణంలా సినీపరిశ్రమను కమ్ముకొంది. అయితే అది ఎల్లకాలం ఉండదు. మబ్బులు తొలగిపోగానే పున్నమి చంద్రుడు మళ్ళీ ప్రకాశించినట్లే తెలుగు సినీపరిశ్రమ కూడా ప్రకాశిస్తుంది. మళ్ళీ యధాప్రకారం దాని ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. 

రాష్ట్ర ప్రజలకు కష్టాలు వస్తే జోలె పట్టుకొని విరాళాలు సేకరించి సహాయపడిన చరిత్ర మన ఇండస్ట్రీకి ఉంది. తెలుగు సినీపరిశ్రమ మొదలైనప్పటి నుంచి ‘చెడు మీద మంచి విజయం సాధిస్తుందనే’ ఏకైక కాన్సెప్ట్ తోనే సినిమాలు తీస్తోంది తప్ప చెడు విజయం సాధిస్తుందని చెప్పలేదు. తెలుగు సినీపరిశ్రమ ఎప్పుడూ అందరికీ మంచే జరుగాలని కోరుకొంటుంది. దానిపై కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడున్నాయి. ఇండస్ట్రీలో డ్రగ్స్ అలవాటున్నవారిని గుర్తించి విచారించడాన్ని మేము తప్పు పట్టడం లేదు. అటువంటి వారిపై ఇండస్ట్రీ కూడా చర్యలు తీసుకొంటుంది. కానీ తెలుగు సినీపరిశ్రమ పేరుప్రతిష్టలు, దాని ప్రయోజనాలు అన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ కేసులను కాస్త హుందాగా, సున్నితంగా హ్యాండిల్ చేయమని ఈ లేఖ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము,” అని లేఖలో వ్రాశారు. 


Related Post