అవన్నీ ఊహాగానాలే: లక్ష్మణ్

August 02, 2017


img

తెరాస, భాజపాలు ఆ మద్య కాస్త దగ్గరైనట్లు కనిపించినా, ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ల బిల్లును శాసనసభ చేత ఆమోదింపజేసినప్పటి నుంచి తెరాసకు భాజపా దూరం అయ్యింది. అప్పటి నుంచి తెరాసను తమ రాజకీయశత్రువుగానే భావిస్తున్నామని రాష్ట్ర భాజపా నేతలు చెపుతున్నారు. కానీ ఆ శత్రుత్వం రాష్ట్ర స్థాయికే పరిమితం చేసుకోవడం విశేషం. రాష్ట్రపతి ఎన్నికలలో రాంనాథ్ కోవింద్ కు ఎన్డీయే కూటమిలో మరే భాగస్వామ్యపార్టీ ఇవ్వనంతగా తెరాస మద్దతు ఇవ్వడమే అందుకు చక్కటి నిదర్శనం. అంతమాత్రన్న తెరాసతో పొత్తులు పెట్టుకొంటామని ఊహించడం సరికాదని, తెరాసతో తమకు సైద్దాంతికంగా చాలా విభేదాలు ఉన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. నేటికీ తెరాస పట్ల తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని, తెరాసపై తమ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. ముందుగా సెప్టెంబర్ 17న తెలంగాణా విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపేందుకు ఒత్తిడి తెస్తామని చెప్పారు.  

నిజానికి తెరాసతో పొత్తులు పెట్టుకోవడానికి భాజపాయే ఆశపడుతోంది కానీ తెరాస ఏనాడూ భాజపాతో చేతులు కలాపాలనుకోలేదు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూర్యాపేట సభలో స్వయంగా తెరాసకు స్నేహహస్తం అందించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదు. భాజపాతో చేతులు కలిపితే తెరాస తన స్వేచ్చా స్వాతంత్ర్యాలు కోల్పోతుంది. పైగా రాష్ట్రంలో ముస్లింలు తెరాసకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే తెరాస తన దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భాజపాకు దూరంగా ఉంటోంది. ఈ విషయాలన్నీ భాజపా నేతలకు తెలియవనుకోలేము. కానీ తెలియనట్లుగా తామే తెరాసతో పొత్తులు వద్దనుకొంటున్నామని చెప్పుకొంటుంటారు. జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాదులకు బహిరంగంగా మద్దతు పలికే పిడిపితో పొత్తులు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వం నడుపగా లేనిదీ తమకు అవసర సమయాలలో అండగా నిలబడుతున్నట్టి, దేశంలో అత్యుత్తమ రాష్ట్ర ప్రభుత్వాలలో ఒకటిగా మంచి పేరున్న తెరాసతో పొత్తులకు సైద్దాంతిక విభేదాలు అడ్డు అని డా.కె.లక్ష్మణ్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దీనినే అందని ద్రాక్షలు పుల్లన అంటారేమో కదా!     



Related Post