తను తవ్వుకొన్న గోతిలో తనే పడ్డాడు విక్రం గౌడ్

August 02, 2017


img

  కాంగ్రెస్ నేత విక్రం గౌడ్ తన సమస్యల నుంచి బయటపడటానికి తనపై తానే హత్యాప్రయత్నం చేసుకోవడానికి వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. చివరకు తను తవ్వుకొన్న గోతిలో తనే పడ్డాడు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనిని ఈరోజు జనరల్ వార్డులోకి మార్చగానే బంజారా హిల్స్ పోలీసులు అతనికి అరెస్ట్ వారెంట్ అందించారు. అతనితో పాటు ఈ కుట్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకొన్న మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

గత కొన్నేళ్ళుగా తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్న విక్రం గౌడ్ వాటి నుంచి బయటపడేందుకు తనపై తానే హత్యాప్రయత్నం చేయించుకోవడానికి గత 6 నెలలుగా ప్లాన్ సిద్దం చేసుకొన్నాడు. ఒక షార్ప్ షూటర్స్ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకొన్నాడు. 

ఈ హత్యాప్రయత్నం కోసం విక్రం గౌడ్ వారితో అనేకసార్లు సమావేశం అయ్యాడు. వారు దీని కోసం ఐదుసార్లు రెక్కీ కూడా నిర్వహించారు. ఈ ప్లాన్ ఫైనల్ గా అమలు చేయడానికి రెండు రోజుల ముందే ఆ షార్ప్ షూటర్స్ లో ఒకరితో విక్రం గౌడ్ తన ఇంట్లోనే సమావేశమయ్యాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు రెండు నెలల ముందే విక్రం గౌడ్ ఇంట్లో ఏర్పాటు చేసిన కొన్ని సిసి కెమెరాలను తొలగింపచేశాడు. 

విక్రం గౌడ్ చలా పకడ్బందీగా ఈ ప్లాన్ అమలుచేసినప్పటికీ పోలీసులు చాలా చురుకుగా, లోతుగా దర్యాప్తు జరిపి ఈ కేసులో విక్రం గౌడే ప్రధాన నిందితుడని గుర్తించారు. అందుకు వారు అనేక బలమైన ఆధారాలు సంపాదించారు. నిందితులు అందరినీ పోలీసులు బుధవారం మీడియా ముందుకు తీసుకువచ్చి ఈ హత్యాయత్నం గురించి వివరించనున్నారు. 

ఈ ప్లాన్ తో విక్రం గౌడ్ తన అప్పుల బాధల నుంచి విముక్తి పొందుదామనుకొంటే, చివరికి జైలు పాలుకాబోతున్నాడు. జీవితంలో విజయం సాధించడానికి తెలివితేటలు చాలా అవసరమే. కానీ ఇటువంటి అతితెలివితేటలు ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందని మరోమారు స్పష్టం అయ్యింది.  


Related Post