ప్రతిపక్షాలకు తెలంగాణా మీదే ఆశలెందుకు?

August 01, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో తెరాస చాలా బలంగా ఉంది. తెరాస సర్కార్ ఎప్పటికప్పుడు అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతూ మంచి ప్రజాధారణ పొందుతోంది. ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో వరుస విజయాలు సాధిస్తోంది. ప్రభుత్వం పనితీరును కేంద్రప్రభుత్వం కూడా మెచ్చుకొంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినట్లయితే తెరాస 101-106 సీట్లు గెలుచుకొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ డంకా బజాయించి చెపుతున్నారు. వాస్తవ పరిస్థితులు చూస్తే వచ్చే ఎన్నికలలో మళ్ళీ తెరాసయే విజయం సాధించి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

అయినా కాంగ్రెస్, భాజపా, చివరకి ఎన్నడూ ఆధికారం ఆశించని వామపక్షాలు కూడా రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉందని, తెరాసకు తామే ఏకైక ప్రత్యామ్నాయమని భావిస్తూ పాదయాత్రలు, బస్సు యాత్రలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి తామే తప్పకుండా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, భాజపాలు డంకా బజాయించి చెపుతున్నాయి. చెప్పడమే కాదు వచ్చే ఎన్నికల కోసం అప్పుడే సన్నాహాలు చేసుకొంటున్నాయి కూడా. 

అయితే రాష్ట్రంలో తెరాసకు రాష్ట్రంలో చాలా సానుకూల వాతావరణం, మంచి బలం, ప్రజాధారణ ఉన్నాయని తెలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్, భాజపాలు తెలంగాణాలో అధికారంలోకి రాగలమని ఎందుకు కలలు కంటున్నాయి? అనే సందేహం కలుగకమానదు. అందుకు దేని కారణాలు దానికున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉండేది. కానీ రాష్ట్ర విభజనతో ఆంధ్రాలో దాదాపు కనబడకుండాపోయింది. ఏపిలో ఆ పార్టీ ఇంకా ఉందో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. కనుక ఏపిపై ఇక ఆశలు పెట్టుకొనవసరం లేదు. ఇక మిగిలింది తెలంగాణాయే కనుక ఇక్కడ అధికారంలోకి రావాలని కలలు కంటోంది. 

2014 ఎన్నికలలో తెరాస చేతిలో ఓడిపోయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ నేతలలో కొంత ఐక్యత పెరిగి ప్రభుత్వంపై సమిశితి పోరాటాలు చేస్తున్నారు. పైగా తెరాస సర్కార్ తీసుకొంటున్న కొన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాల వలన దానిపట్ల ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉందని, దానినే తమకు అనుకూలంగా మార్చుకోగలిగితే అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై ఆశలు పెంచుకోవడానికి ఇవే కారణాలు కనిపిస్తున్నాయి.

ఇక తెలంగాణాలో తెదేపాకు భాజపా దూరం అయినప్పటికీ ఆ ప్రభావం ఏపిలో వాటి సఖ్యతపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం విశేషం. కనుక వచ్చే ఎన్నికలలో అవి కలిసి పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. కనుక ఏపిలో భాజపా అధికారం చేజిక్కించుకోవడం గురించి ఆలోచనే చేయడం లేదు. భవిష్యత్ లో చేస్తుందేమో? 

కానీ తెలంగాణాలో తెరాసతో భాజపాకు పొత్తులు లేవు. పొత్తులు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నా తెరాస పట్టించుకోవడం లేదు. మున్ముందు చూపుతుందేమో తెలియదు. కనుక తెరాసను శత్రువుగానే భావించి అధికారం కోసం ఆలోచనలు చేయడం సహజమే. 

ఏపితో పోలిస్తే తెలంగాణాలోనే భాజపా బలంగా ఉంది. పైగా మత రాజకీయాలు చేయడానికి భాజపాకు ఏపిలో కంటే తెలంగాణాలోనే అవకాశాలు ఎక్కువ. కనుక భాజపా తెలంగాణాపై ఎక్కువ ఫోకస్ పెడుతోందని చెప్పవచ్చు. అయితే మున్ముందు ఏపి, తెలంగాణా రాష్ట్రాలపై పూర్తి పట్టు సాధించేందుకు ‘ఆపరేషన్-బిహార్ పద్ధతిని’ ఎప్పుడైనా అమలుచేయవచ్చు. ఎందుకంటే తెదేపా, తెరాసలు రెంటి బలహీనతలు ప్రధాని నరేంద్ర మోడీకి, అమిత్ షాకు బాగా తెలుసు. సరైన సమయం, అవకాశం వస్తే ఆపరేషన్ చేయడం తధ్యం.


Related Post