తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పై కాంగ్రెస్ అధిష్టానం వేటువేసింది. ఆయన స్థానంలో రామచంద్ర కుంతియాను పూర్తిస్థాయి ఇంఛార్జ్ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. తెరాస సర్కార్ పై దిగ్విజయ్ సింగ్ చేస్తున్న అసంబద్దమైన ఆరోపణలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పైగా ఆయన రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి బదులు పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని ఇంకా బలహీనపరుస్తున్నారని కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కనుక ఆయనను రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీలో కొంత మంది నేతలు తమ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఇంత త్వరగా ఆయనను ఆ పదవిలో నుంచి తప్పిస్తారని వారు కూడా ఊహించలేకపోయారు.
దిగ్విజయ్ సింగ్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకు ఏ రాష్ట్రాన్ని అప్పగిస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు తాళాలు వేయిస్తుంటారు. తన స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో మొదలుపెట్టి ఏపి వరకు తనకు అప్పగించిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోకుండా చేసి విడిచిపెట్టారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. తెలంగాణాలో కొద్దిగా అవకాశాలు కనబడుతున్నాయి. కనుక కనీసం తెలంగాణాలో అయినా తమ విజయావకాశాలను కాపాడుకోవాలనే ఆలోచనతోనే దిగ్విజయ్ సింగ్ ను ఆ భాద్యతల నుంచి తప్పించి ఉండవచ్చు. ఏపిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొల్కొనే అవకాశాలు అసలు కనబడటం లేదు కనుక ఆ రాష్ట్రాన్ని దిగ్విజయ్ సింగ్ చేతిలోనే ఉంచింది కాంగ్రెస్ అధిష్టానం.