ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకొన్నవారిలో చివరివాడైన నటుడు నందు ఈరోజు విచారణకు హాజరయ్యాడు. అతని విచారణతో ఈ డ్రగ్స్ కేసులలో సినీప్రముఖుల విచారణ పూర్తవుతుంది. కనుక ఎక్సైజ్ శాఖ తరువాత ఏమి చేయబోతోంది? విచారణకు హాజరైనవారిలో ఎవరినైనా నిందితులుగా నిర్ధారించి వారిపై కేసులు నమోదు చేస్తుందా లేక అన్ని కేసులను అటకెక్కించేస్తుందో చూడాలి.
ఒకవేళ ఈ విచారణలతోనే ఈ కేసులు ముగింపు పలికినట్లయితే ఎక్సైజ్ శాఖ కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లవుతుంది. మియాపూర్ భూకుంభకోణం కేసులపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణ పేరిట హడావుడి చేసిందనే ప్రతిపక్షాల ఆరోపణలను నిజమని నమ్మవలసి ఉంటుంది.
ఒకవేళ ఈ భూకుంభకోణం వ్యవహారం నుంచి ప్రభుత్వం తనను తాను కాపాడుకోవడానికే సినీ ప్రముఖులను విచారణకు రప్పించి ఉండి ఉంటే అంత కంటే దారుణం మరొకటి ఉండదు. దీని వలన వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింది. వారు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు. ఇంతకాలం సమాజంలో దృష్టిలో హీరోలుగా ఉన్నవారు ఇప్పుడు అదే సమాజంలో తలెత్తుకొని తిరుగలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ డ్రగ్స్ కేసుల విచారణ ముగింపు వచ్చే సమయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విధంగా, మంత్రి తలసాని మరోవిధంగా స్పందించడం విశేషం. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎవరు దోషులుగా తేలినా చట్టప్రకారం శిక్షలు తప్పవని తలసాని యాదవ్ అంటే, డ్రగ్స్ తీసుకొన్నవారిని కేవలం బాధితులుగా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విశేషం.
ఈ డ్రగ్స్ కేసుల విచారణ మొదలైనప్పుడు హైదరాబాద్ నగరం నుంచి డ్రగ్స్ మహమ్మారిని శాశ్వితంగా తరిమికొట్టడమే తమ ధ్యేయమని చెప్పిన ప్రభుత్వం, కేసుల విచారణ ముగిసే సమయానికి కొంత మెత్తబడినట్లు కనబడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ డ్రగ్స్ కేసులలో సినీ ప్రముఖులను శిక్షించడం కంటే నగరంలో ఈ డ్రగ్స్ సరఫరా ముఠాలను వాటి మూలాలను కనిపెట్టి వాటిని సమూలంగా తుడిచిపెట్టడమే చాలా ముఖ్యం. కనుక ఎక్సైజ్ శాఖ ఆ ఒక్క పని సమర్ధంగా చేస్తుందని ఆశిద్దాం.