కేసీఆర్ కు ఎందుకీ ప్రాకులాటలు?

July 29, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాసకు, తెలంగాణా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ వంటివారని చెప్పవచ్చు. కనుక ఆయన ఎవరినో ప్రసన్నం చేసుకొనేందుకు ప్రాకులాడవలసిన అవసరమే లేదు. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ ఆయన మజ్లీస్ పార్టీ అధినేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రాకులాడుతున్నారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. . 

వారిని ప్రసన్నం చేసుకోవడానికే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ అధికారికంగా నిర్వహించడలేదని రాష్ట్ర భాజపా నేతలు చేస్తున్న ఆరోపిస్తుంటారు. ఇక ఓవైసీ సోదరులను, రాష్ట్రంలో ముస్లిం ప్రజలను ప్రసన్నం చేసుకొనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ తన పరిధిలో లేని అంశమైన ముస్లిం రిజర్వేషన్ బిల్లును పైకి తీసుకువచ్చారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో ముస్లింల ఓట్లన్నీ తెరాసవైపు మళ్ళించుకొనేందుకే ఇటువంటి ఆచరణ సాధ్యం కాని అంశాలు తెరపైకి తెచ్చి కేసీఆర్ ముస్లిం ప్రజలను మభ్యపెడుతున్నారని భాజపా నేతలు వాదిస్తున్నారు. 

మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసిపై జరిగిన హత్యాప్రయత్నం కేసులో న్యాయస్థానం తన అంతిమ తీర్పును వెలువరించినప్పటికీ ఓవైసీ సోదరులను ప్రసన్నం చేసుకోనేందుకే తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ దానిపై హైకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించుకొందని భాజపా నేతలు అభిప్రాయపడుతున్నారు. 

ఆ కేసులో నిర్దోషులుగా విడుదలైన వారిపై మళ్ళీ విచారణ జరపాలని, దోషులుగా నిర్ధారించబడి జైలుశిక్షలు పడినవారికి మరింత కటినమైన శిక్షలు విధించాలని తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వం హైకోర్టును కోరబోతోంది. 

నిజానికి భాదితుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆవిధంగా హైకోర్టులో అప్పీలు చేసుకొన్నా ఎవరూ ఆపేక్షించేవారు కాదు. కానీ ఆయన హైకోర్టుకు వెళ్ళేందుకు ఆసక్తి చూపకపోయినా తెలంగాణా ప్రభుత్వం దానిని నెత్తిన పెట్టుకొంటోందని అర్ధం అవుతోంది. ఆ కేసుపై తెలంగాణా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళడం వలన దానికి ఒరిగేదేమీ ఉండదు ఖర్చులు తప్ప. అయినా ఎందుకు వెళుతోంది? అంటే ఒవైసీ సోదరులను ప్రసన్నం చేసుకోవడానికేనని రాష్ట్ర భాజపా నేతలు అభిప్రాయపడుతున్నారు. 

వచ్చే ఎన్నికలలో తెరాస 100-106 అసెంబ్లీ సీట్లు గెలుచుకోబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పదేపదే గట్టిగా చెపుతున్నప్పుడు మరి ఒవైసీ సోదరులను ప్రసన్నం చేసుకోవడానికి ఎందుకీ ప్రాకులాటలు? ఆ సర్వే ఫలితాలపై ఆయనకే నమ్మకం లేదా లేక వచ్చే ఎన్నికలలో తప్పకుండా విజయం సాధించదానికి ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నారనుకోవాలా? ఏమో కేసీఆరే చెప్పాలి.  


Related Post