డ్రగ్స్ కేసులపై కొనసాగుతున్న దర్యాప్తు, విచారణపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అధికారులు కేసుల పురోగతి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణా రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా, వాటిని తీసుకొంటున్నవారి గణాంకాలు ఆయనకు వివరించారు. ప్రస్తుతం ఈ డ్రగ్స్ వ్యవహారాలు ఇంకా మొగ్గ దశలోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్, గుడంబా, తంబాకు, జూదం, ఆహార పదార్ధాల కల్తీ వంటివన్నీ అరికట్టి రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖకు పూర్తి స్వేచ్చనిస్తున్నట్లు చెప్పారు.
దేశంలో వ్యవసాయంలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ రాష్ట్రం ఈ డ్రగ్స్ మహమ్మారి కారణంగానే తీవ్ర అప్రదిష్ట మూటగట్టుకొంటోంది. అక్కడ ఈ సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తూ ఉడ్తా పంజాబ్ అనే సినిమా కూడా వచ్చింది. ఆ డ్రగ్స్ కారణంగా ఎలాగూ సమాజం..దానిలో భాగమైన కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం కాకమానవు. డ్రగ్స్ అరికట్టడంలో భాజపా-అకాలీదళ్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఘోరంగా విఫలం అవడం చేతనే అధికారం కోల్పోయింది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ డ్రగ్స్ వ్యవహారాలనే ప్రధానాంశంగా చేసుకొని ఆమాద్మీ పార్టీ ప్రచారం చేసింది.
కనుక ఈ డ్రగ్స్ వ్యవహారాలను మొగ్గ దశలోనే నిర్దాక్షిణ్యంగా త్రుంచివేయలేక పోతే తెలంగాణాకే కాదు ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి సమస్యలన్నీ పుట్టుకు వచ్చి చివరికి ప్రజలను, ప్రభుత్వాలను కూడా కబళించివేసే ప్రమాదం ఉంటుంది. పంజాబ్ లో 10,220 కేసులతో పోలిస్తే తెలంగాణాలో దాదాపు లేనట్లే అని సరిచెప్పుకోవడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ.
కనుక తెలంగాణా ప్రభుత్వం ఈ డ్రగ్స్ వ్యవహారాలలో తమ,పర అనే భేదం చూపకుండా అరికట్టేందుకు చిత్తశుద్ధితో గట్టిగా ప్రయత్నించడం చాలా అవసరం. ఈ కేసులను కూడా రాజకీయ కోణంలోనే చూసి తరువాత మెల్లగా అటకెకించే ప్రయత్నం చేసినట్లయితే చివరికి నష్టపోయేది రాష్ట్రమే..ప్రజలే దానికి మూల్యం చెల్లించవలసివస్తుంది అని మరిచిపోకూడదు.