ఉత్తర కొరియా ప్రయోగిస్తుంది..అమెరికా లెక్క బెడుతుంటుంది!

July 29, 2017


img

మనం దీపావళి పటాసులను పేల్చినంత సులువుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ వున్‌ ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తూ దక్షిణ కొరియా, అమెరికా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. జూలై 4వ తేదీన ఒక ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఉత్తర కొరియా, మళ్ళీ శనివారం తెల్లవారుజామున అంతకంటే శక్తివంతమైన హ్వాసంగ్‌-14 ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. 3,725 కిమీ ఎత్తులో సుమారు 1,000 దూరం ప్రయాణించి జపాన్ సముద్రజలాలో పడేవిధంగా దానిని ప్రయోగించారు. 

ఆ ప్రయోగం విజయవంతం అయ్యిందని, దానితో అమెరికాలో దాదాపు అన్ని ప్రధాన నగరాలను ద్వంసం చేయగలమని కిమ్‌ జాంగ్‌ వున్‌ చెప్పి అమెరికాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అమెరికా సంయమనం కోల్పోలేదు. ఈ ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెంటనే స్పందిస్తూ, “ఉత్తర కొరియాను ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా అది ప్రమాదకరమైన ఇటువంటి విన్యాసాలు చేస్తూనే ఉంది. అమెరికాను, ప్రజలను కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలన్నీ తీసుకొంటాము,” అని అన్నారు. 

ఈ రెండు దేశాల తీరును చూసి “ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంటుంది....అమెరికా వాటిని లెక్కబెడుతూనే ఉంటుందనే” కొత్త జోక్ పుట్టుకొచ్చింది. అయితే అమెరికా ఇంత సంయమనం ప్రదర్శించడం చాలా గొప్ప విషయమే..ప్రస్తుతం అదే సరైన విదానమనే వాదనలు కూడా వినిపిస్తోంది. కానీ ఎంత రెచ్చగొడుతున్నా అమెరికా తమతో యుద్దానికి సిద్దం కాకపోవడంతో యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ వున్‌ ఏదో ఒకరోజున నేరుగా అమెరికా మీదకే ఖండాంతర క్షిపణిని ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. అప్పుడు యుద్దాన్ని వినాశనాన్ని ఎవరూ ఆపలేరు.  


Related Post