కేసీఆర్ మొన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “నా అంచనాల ప్రకారం వచ్చే ఎన్నికలలో ఏపిలో వైకాపాకు 45 శాతం, తెదేపాకు 42 శాతం వచ్చే అవకాశం ఉంది. ఏపిలో ముస్లింల సంఖ్య తక్కువగా ఉంది కనుక భాజపా కాపు నేతలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా తన బలాన్ని పెంచుకోవాలని యోచిస్తున్నట్లు కనబడుతోంది. కానీ ఏపిలో భాజపాకు 2 శాతం, జనసేనకు కేవలం 1.2 శాతం ఓట్లు మాత్రమే రావచ్చు,” అని అన్నారు.
కేసీఆర్ చెప్పిన ఈ జోస్యం సహజంగానే జగన్మోహన్ రెడ్డికి వైకాపా నేతలకు చాలా ఆనందం కలిగిస్తే, తెదేపా, భాజపాలకు ఆగ్రహం కలిగించవచ్చు.
కనుక తెదేపా మంత్రి జవహర్ దానిపై స్పందిస్తూ, “ఆంధ్రప్రదేశ్ లో కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి కూడా అనర్హుడైన జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికలలో 45 శాతం ఓట్లు వస్తాయని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనం. ఏపిలో చేసిన సర్వే ఫలితాలని కేసీఆర్ చెపుతున్న ఈ మాటల ద్వారా జగన్-కేసీఆర్ మద్య ఎటువంటి రహస్య సంబంధాలున్నాయో బయటపడింది. కేసీఆర్ కు సర్వేలు చేయించుకొని జోస్యం చెప్పడం అంత ముచ్చటగా ఉన్నట్లయితే ఆ ఫాం హౌస్ విడిచిపెట్టి ఒక జ్యోతిషాలయం పెట్టుకొంటే బాగుంటుంది కదా? 2014 ఎన్నికలలో ఇలాగే జ్యోతిష్యాలు చెప్పి అభాసుపాలయిన సంగతి కేసీఆర్ అప్పుడే మరిచిపోయినట్లున్నారు. ఏపిని చంద్రబాబు నాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలరనే నమ్మకంతో ఏపి ప్రజలు 2014 ఎన్నికలలో ఆయనకు పట్టం కట్టారు. వారి ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడికే వచ్చే ఎన్నికలలో కూడా ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ఏపిలో రాజధాని అమరావతి తదితర ప్రాజెక్టుల నిర్మాణం మరో 25 సం.ల వరకు సాగుతుంది. కనుక అప్పటి వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు,” అని అన్నారు.
కేసీఆర్ చెప్పిన జోస్యంపై తెదేపాకు ఆగ్రహం కలగడం సహజమే. కానీ గత ఎన్నికలలో జగన్ త్రుటిలో అధికారం తప్పిపోయిన సంగతి గుర్తు చేసుకొన్నట్లయితే, కేసీఆర్ చెప్పిన ఈ జోస్యంలో వాస్తవికత అర్ధం అవుతుంది. వచ్చే ఎన్నికలలో జగన్ తప్పనిసరిగా గెలవాలనే పట్టుదలతో అప్పుడే ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ను కూడా రప్పించారు. నవరత్నాలు పేరుతో అప్పుడే ఎన్నికల హామీలు ప్రకటించారు. త్వరలో పాదయాత్ర కూడా చేయబోతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైకాపా ఓడిపోయినట్లయితే ఆ తరువాత ఆ పార్టీ చెల్లాచెదురయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి వైకాపాకు జీవన్మరణ సమస్య వంటివని చెప్పవచ్చు కనుక జగన్ తెదేపాకు చాలా గట్టిపోటీ ఇవ్వడం ఖాయం. ఆ లెక్కన చూస్తే కేసీఆర్ చెప్పినట్లు తెదేపా, వైకాపాల మద్య ‘నువ్వా.. నేనా..’ అన్నట్లు పోటీ ఉంటుందని అర్ధం అవుతోంది.
భాజపా, జనసేనల విషయంలో కూడా కేసీఆర్ చెప్పిన జోస్యం వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చెప్పినదే కనుక అది కూడా నిజమయ్యే అవకాశం ఉంది. కనుక కేసీఆర్ జోస్యాన్ని చూసి తెదేపా నేతలు మండి పడి ఎదురు దాడి చేయడం కంటే ఇప్పుడే మేల్కొని పార్టీ విజయావకాశాలు మెరుగుపరుచుకోవడానికి ఏమేమీ చేయాలో అవి చేస్తే వారికే మంచిది.