పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతిపరుడు, ఆ పదవిలో కొనసాగేందుకు అనర్హుడు..అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయమని పాక్ సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు చెప్పడంతో కొద్దిసేపటి క్రితమే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పాక్ ప్రధానులు అవినీతికి పాల్పడటం, ఈవిధంగా సుప్రీంకోర్టు చేత వేలెత్తి చూపించుకొని పదవులు పోగొట్టుకోవడం కొత్తేమీ కాదు. కానీ విశేషమేమిటంటే సరిగ్గా ఇదే సమయంలో హిజాబ్ అసీఫ్ అనే ఒక పాక్ మహిళ తమ దేశానికి మన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ వంటి ప్రధానమంత్రి ఉంటే ఎంతగా అభివృద్ధి చెంది ఉండేదో కదా అని సుష్మపై ప్రసంశల వర్షం కురిపించారు.
కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆమెను పాక్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆమె సహాయం కోసం సుష్మా స్వరాజ్ ను అర్ధించారు. సుష్మ స్వరాజ్ వెంటనే స్పందించి ఆమెకు తక్షణం వీసా మంజూరు చేసి, భారత్ లో ఆమె చికిత్సకు మార్గం సుగమం చేశారు. అందుకే తమ దేశానికి సుష్మా స్వరాజ్ వంటి ప్రధానమంత్రి కావాలని కోరుకొంటున్నట్లు ట్వీట్ చేశారు.
ఆమె ఏమని ట్వీట్ చేసింది అంటే “సుష్మాజీ..మిమ్మల్ని ఏమని పిలవను? సూపర్ విమెన్ అని పిలవాలా లేక దేవత అని సంబోధించాలా? మీ మంచితనాన్ని వివరించడానికి నాకు మాటలు రావడంలేదు. ఐ లవ్యూ మేడమ్... మీకోసమే నా గుండె కొట్టుకుంటోంది. మీరు మా దేశానికి ప్రధానమంత్రి అయ్యుంటే ఎంత బాగుండేదో కదా... అయినా మీలాంటి గొప్ప వ్యక్తులను ప్రధానమంత్రిగా పొందే అర్హత...భాగ్యం మా దేశానికి లేదు” అని ట్వీట్ చేసింది.
ఆమె చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం భారత్, పాక్ దేశాలలో అన్ని ప్రధాన మీడియాలో ప్రముఖంగా ప్రచురితం అయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో అవినీతి ఆరోపణల కారణంగా పాక్ ప్రధానమంత్రి, ఆర్ధిక మంత్రి ఇద్దరూ కూడా సుప్రీంకోర్టు చేత తీవ్రంగా అభిశంసింపబడి తమ పదవులకు రాజీనామా చేయడం కాకతాళీయమే కావచ్చు కానీ ఈ రెండు సంఘటనలు భారత్-పాక్ ప్రభుత్వాలు..వాటి మంత్రులు, ప్రధానుల పనితీరు మద్య ఎంత వ్యత్యాసం ఉందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ దురదృష్టం ఏమిటంటే, నవాజ్ షరీఫ్ తన సోదరుడుకి ప్రధానమంత్రి పదవి అప్పగించబోతున్నట్లు తాజా సమాచారం. కనుక హిజాబ్ అసీఫ్ తమ దేశం గురించి చెప్పింది కూడా నిజమేనని మరోసారి రుజువు కాబోతోంది. కనుక ఇక పాక్ ను ఆ దేవుడే రక్షించాలి.