ప్రధానమంత్రి రాజీనామా?

July 28, 2017


img

ప్రధానమంత్రి రాజీనామా చేశారు. మన ప్రధాని మోడీ కాదు..పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్. పనామా పేపర్స్ కుంభకోణంలో ఆయన, కుటుంబ సభ్యులు కూడా దోషులేనని ఐదుగురు సభ్యులతో కూడిన పాక్ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. షరీఫ్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడని కనుక తక్షణమే పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. అంతే కాదు..షరీఫ్ తో సహా అయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలని జాతీయ అవినీతి నిరోధక శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.

 షరీఫ్ అంటే పెద్దమనిషి అని అర్ధం కానీ నవాజ్ షరీఫ్ అయన కుటుంబ సభ్యులు సూట్ కేస్ కంపెనీలు సృష్టించి వాటి ద్వారా లండన్ లో వందల కోట్లు విలువగల ఆస్తులను పోగేసినట్లు పనామా పేపర్స్ లో బయటపడింది. సుప్రీంకోర్టు తనను అనర్హుడిగా, దోషిగా ప్రకటించినట్లు తెలియగానే నవాజ్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు అభిప్రాయంతో విభేదిస్తున్నప్పటికీ, చట్టాన్ని గౌరవించే వ్యక్తి గనుక తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేశారని ఆయన అధికార ప్రతినిధి చెప్పారు.

షరీఫ్ తో బాటు ఆర్ధికమంత్రి ఇషాక్ దర్ ని కూడా అనర్హుడిగా ప్రకటించింది. కనుక అయన రాజీనామా చేయవలసి ఉంది.

పాకిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా పూర్తి ఐదేళ్ళ కాలం పాటు తన పదవిలో కొనసాగలేకపోయారు. వారిలో చాలా మంది ఇదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. విదేశాలలో ఆస్తులు కూడబెట్టుకొన్నవారే. షరీఫ్ కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించినట్లున్నారు.  


Related Post