అవును...మీరు చూస్తున్నది నిజమే...ఇక్కడ జైళ్ళు అద్దెకు ఇవ్వబడును! ఇదేమిటి...“ఇల్లు అద్దెకు ఇవ్వబడును” అని బోర్డులు చూశాము కానీ జైళ్ళు అద్దెకు ఇవ్వడం ఏమిటి..విడ్డూరం కాకపోతే..”అని ఆశ్చర్యపోకండి. త్వరలో ఇది నిజంగానే జరుగబోతోంది. అదీ మన తెలంగాణా రాష్ట్రంలో జైళ్ళే...అవును నిజం. ఈ విషయం డైరెక్టర్ ఆఫ్ ప్రిసన్స్ వికె సింగ్ స్వయంగా తెలిపారు.
ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో జైళ్ళు ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా యూపి, మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక రాష్ట్రాలలో జైళ్ళు ఖాళీలు లేవు. కనుక కొత్త ఖైదీలను పెట్టడానికి జైళ్ళు లేక ఆ రాష్ట్రాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అదేసమయంలో రాష్ట్ర విభజన కారణంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో జైళ్ళలో ఖాళీలు ఉన్నాయి. కనుక ఇతర రాష్ట్రాలకు తమ ఖైదీలను తెలంగాణా జైళ్ళలో అద్దె ప్రాతిపదికన ఉంచుకోవడానికి ప్రతిపాదనలు తయారుచేస్తున్నామని వికె సింగ్ చెప్పారు.
తెలంగాణా జైళ్ళను ఉపయోగించుకొంటున్నందుకు ఒక్కో ఖైదీకి ఆయా ప్రభుత్వాలు నెలకు రూ.10,000 చొప్పున అద్దె చెల్లించేవిధంగా నియమనిబంధనలు రూపొందిస్తున్నామని చెప్పారు. అయితే చిన్న చిన్న నేరాలు అంటే దొంగతనాలు వంటివి చేసిన ఖైదీలను మాత్రమే అనుమతించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ఇటువంటి విధానం నార్వే దేశంలో విజయవంతంగా అమలవుతోందని చెప్పారు. కనుక దానిని మన దేశంలో కూడా ప్రయోగాత్మకంగా అమలుచేసి చూడాలని భావిస్తున్నట్లు వికె సింగ్ చెప్పారు.
ప్రస్తుతం ఒక్కో ఖైదీపై ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు రోజుకు రూ.120 వరకు ఖర్చు చేస్తున్నాయి. ఆదివారాలు, పండుగ రోజుల్లో అది మరికొంచెం పెరుగుతుంటుంది. ఆ లెక్కన ఒక్కో ఖైదీపై అవి ఏడాదికి సుమారు రూ.43,800 ఖర్చు చేస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణాలో 50 జైళ్ళున్నాయి. వాటిలో 6,063 మంది ఖైదీలున్నారు. ఆ లెక్కన ప్రభుత్వానికి ఏటా వారిపై రూ.26.60 కోట్లు ఖర్చు చేయవలసివస్తోంది. అయితే రాష్ట్రంలో ఉన్న50 జైళ్ళలో మొత్తం 6,848 మంది ఖైదీలను ఉంచడానికి అవకాశం ఉంది. అంటే మరో 800 మంది ఖైదీలకు అవకాశం ఉందన్నమాట. ఒక్కొకరికీ నెలకు రూ.10,000 చొప్పున అద్దె తీసుకొని ఇతర రాష్ట్రాలకు చెందిన 800 మంది ఖైదీలను ఉంచుకొన్నట్లయితే తెలంగాణా ప్రభుత్వానికి నెలకు వారిపై రూ.80 లక్షలు..సంవత్సరానికి రూ.9.60 కోట్లు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్రతిపాదనపై ఆలోచిస్తున్నామని వికె సింగ్ తెలిపారు. దీని వలన తెలంగాణా జైళ్ళ శాఖకు ఆర్ధికంగా కొంత వెసులుబాటు లభిస్తుంది. ఇతర రాష్ట్రాలకు ఖైదీలను ఎక్కడ ఉంచాలనే సమస్య తగ్గుతుంది అని వికె సింగ్ చెప్పారు. అయితే దీనిలో చట్టపరంగా, న్యాయపరమైన అనేక సమస్యలుంటాయి. కనుక వాటన్నిటిపై లోతుగా అధ్యయనం చేసిన తరువాతే ఈ విధానాన్ని అమలు చేస్తామని వికె సింగ్ చెప్పారు.