విజన్-2020, 2050 అంటూ గొప్పలు చెప్పుకొనే పొరుగు ముఖ్యమంత్రిని రోజూ చూస్తూనే ఉన్నాము. కానీ దాని కోసం ఎటువంటి ప్రణాళికలు రూపొందించుకొన్నారు? ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అవి ఏమేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి?అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు వినబడవు. చేసే పని కంటే చేయబోయే పని గురించి గొప్పలు చెప్పుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని అందరికీ తెలుసు.
కానీ తెలంగాణా ప్రభుత్వం ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఎటువంటి హంగామా చేయకుండా వాటిని సాధించేందుకు నిశబ్దంగా ముందుకు సాగిపోతోంది. అవి ఒకటొకటి సాకారం చేసి చూపినప్పుడే అది తెర వెనుక ఎంత కృషి చేస్తోందో అర్ధం అవుతుంది.
ఐటి రంగం గురించి పూర్తి అవగాహన ఉన్న కేటిఆర్ ఆ శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వలన ఆ రంగంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘సాఫ్ట్ నెట్’ ద్వారా విద్యాభోధన, శిక్షణ కార్యక్రమాలు టీవీ ఛానళ్ళ ద్వారా అందించే కార్యక్రమాన్ని నిన్న మంత్రులు కేటిఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు. దాని పేరును ‘టీశాట్’ గా మార్చారు. ఆ సందర్భంగా మంత్రి కేటిఆర్ చెప్పిన కొన్ని విషయాలు ఆయన దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తాయి.
“ప్రస్తుతం టీశాట్ ద్వారా టెలీ మెడిసన్, ఈ-గవర్నెన్స్, దూరవిద్య భోధన, వ్యవసాయ సలహాలు వంటి అనేక ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ టీశాట్ లో టి అంటే తెలంగాణా మరియు టెక్నాలజీ, ఎస్ అంటే స్కిల్స్, ఏ అంటే అకాడమిక్స్ అని అర్ధం. దీనితో ప్రస్తుతం రెండు ఛానల్స్ నిర్వహిస్తున్నాముఆధునిక టెక్నాలజీని మనం అందుకొని వినియోగించుకోగలిగితే అది సామాన్య ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.. మేలు చేస్తుందని ఈ టీశాట్ ద్వారా నిరూపితం అయ్యింది. మున్ముందు తెలంగాణా రాష్ట్ర అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక శాటిలైట్ ఏర్పాటు చేసుకోవాలని మేము భావిస్తున్నాము. దాని కోసం ఇస్రోతో ఒక ఒప్పందం కూడా చేసుకొన్నాము. ముందుగా మనకంటూ ఒక శాటిలైట్ ఏర్పాటు చేసుకొన్నాక భవిష్యత్ లో మన అవసరాలను బట్టి మరిన్ని శాటిలైట్స్ ఏర్పాటు చేసుకొనే ఆలోచన కూడా ఉంది,” అని మంత్రి కేటిఆర్ అన్నారు.
ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి స్వంతంగా ఒక శాటిలైట్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కలుగలేదు. అ ఆలోచన తెలంగాణా ప్రభుత్వం చేసింది. దానినే దూరదృష్టి లేదా విజన్ అంటారు కదా!