రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉంది. సీట్ల పెంపు కోసం కేంద్రప్రభుత్వం కసరత్తు మొదలైందని, ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోనే దాని కోసం బిల్లు ప్రవేశపెట్టబోతోందని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ తరువాత మీడియాతో అన్న మాటలు వింటే కేంద్రప్రభుత్వానికి శాసనసభ స్థానాలు పెంచే ఉద్దేశ్యం లేదన్నట్లు అర్ధం అవుతోంది.
కేసీఆర్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మా అజెండాలో సీట్ల పెంపు కూడా అంశం మాత్రమే. దాని గురించి ప్రధాని మోడీతో మాట్లాడాను. అది పరిశీలనలో ఉందని చెప్పారు. అంతే. అది ఇంకా ఎంతకాలం పరిశీలనలో ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ పెంచితే మంచిదే. లేకునా మాకేమీ ఫరక్ పడదు,” అని అన్నారు.
అంటే సీట్ల పెంపుపై కేంద్రప్రభుత్వం సానుకూలంగా లేదని స్పష్టం అవుతోంది. విశాఖలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉంది కానీ దాని ఏర్పాటుచేయడానికి కొన్ని సమస్యలున్నాయి కనుక ఎపుడు అడిగినా ఆ అంశం ఇంకా పరిశీలనలో ఉందనే ఇన్స్టాంట్ సమాధానం వస్తుంటుంది. సీట్ల పెంపుకు కూడా అదే సమాధానం వస్తోంది కనుక అది కూడా అటకెక్కిపోయినట్లే భావించవచ్చు. లేకుంటే కేసీఆర్ దాని గురించి చాలా గొప్పగానే చెప్పుకొని ఉండేవారు కదా?
అయితే ఈ విషయం ఏపి సిఎం చంద్రబాబుకు, తెదేపా ఎంపిలకు తెలియకనే సీట్ల పెంపు ఉంటుందని చెపుతున్నారా? అంటే కాదనే చెప్పవచ్చు. ఏపికి ప్రత్యేక హోదా రాదని రెండేళ్ళ క్రితమే వారికి ఖచ్చితంగా తెలిసి ఉన్నప్పటికీ ప్రజాగ్రహానికి భయపడి ఏవిధంగా మభ్యపెడుతూ కాలక్షేపం చేసి చివరికి ప్రత్యేక ప్యాకేజి పేరుతో సరిపెట్టుకొన్నారో...ఈ విషయంలో కూడా వైకాపా నుంచి తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను, వారి కారణంగా ఆందోళన చెందుతున్న తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మభ్య పెట్టేందుకే వచ్చే ఎన్నికలలోగా తప్పకుండా శాసనసభ సీట్లు పెరుగుతాయని చెపుతూ అందరినీ మభ్యపెడుతున్నారని భావించవచ్చు.
ఒకవేళ సీట్లు పెరుగకపోయినా మాకేమి ‘ఫరక్’ పడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు కూడా అటువంటివేనని చెప్పవచ్చు. సీట్లు పెరుగకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, కొత్తగా పార్టీలో చేరినవారికి ఏవిధంగా న్యాయం చేయగలుగుతారు? ఎవరిని పక్కన పెడతారు? అని ఆలోచిస్తే సీట్లు పెరుగకపోతే తప్పకుండా ఫరక్ పడుతుందని అర్ధమవుతుంది.
సీట్లు పెరిగే అవకాశం లేదని స్పష్టం అయ్యింది కనుక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ భవిష్యత్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించుకొంటే మంచిది. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది కదా!