బిహార్లో అర్ధరాత్రి రాజకీయాలు...హైడ్రామా

July 27, 2017


img

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిన్న సాయంత్రం తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలలో చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆర్.జె.డి.తో విభేదాలు తారస్థాయికి చేరినందున ఆయన నిన్న సాయంత్రం గవర్నర్  కేసరినాథ్‌ త్రిపాఠికి తన రాజినమా లేఖను సమర్పించారు. దానిని అయన వెంటనే ఆమోదించడం విశేషం. రెండు గంటల వ్యవధిలోనే జెడియు శాసనసభ్యులు సమావేశమయ్యి మళ్ళీ నితీష్ కుమార్ నే శాసనసభా పక్షనేతగా ఎన్నుకొన్నారు. అదే సమయంలో ప్రధాని మోడీ అధ్యక్షతన డిల్లీలో భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. దానిలో నితీష్ కుమార్ నిర్ణయాన్ని మోడీ స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. అవినీతిపై తాము చేస్తున్న పోరాటంలో ఆయన కూడా కలిసినందుకు అభినందిస్తున్నానని అన్నారు. బీహార్ లో మళ్ళీ ఆయన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తామని వెంటనే రాష్ట్ర భాజపా ప్రకటించింది. గవర్నర్ కు ఆ విషయం తెలియజేసింది కూడా. కనుక భాజపా ఎమ్మెల్యేల మద్దతుతో నితీష్ కుమార్ ఈరోజు సాయంత్రం మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 

నితీష్ కుమార్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు తన కొడుకు తేజస్వీ యాదవ్ ను బలిపశువుగా చేశారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. 1991 లోక్ సభ ఎన్నికల సమయంలో జరిగిన ఒక హత్య కేసులో నితీష్ కుమార్ నిందితుడుగా ఉన్నారని, ప్రస్తుతం ఆ కేసు పాట్నా హైకోర్టు విచారణలో ఉందని దాని నుంచి తప్పించుకోవడానికే తన కొడుకు తేజస్వీపై అవినీతి ఆరోపణలను సాకుగా చూపుతూ నితీష్ కుమార్ ఈ నాటకమంతా ఆడారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ నితీష్ కుమార్, భాజపా కలిసి ఆడిన ఈ రాజకీయ చదరంగంలో లాలూ అండ్ సన్స్ ఓడిపోయారు. 24గంటల వ్యవధిలోనే నితీష్ కుమార్ మళ్ళీ బిహార్ సిఎం అవుతున్నారు. నిన్నటి వరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేసిన తేజస్వీ యాదవ్ గవర్నర్ నిర్ణయాన్ని నిరసిస్తూ నిన్న అర్దరాత్రి రాజ్ భవన్ ముందు ధర్నా చేశారు. ఈ నాటకీయ పరిణామాలన్నీ ప్రీ-ప్లాన్ గా చేసినవేనని అతను ఆరోపించాడు.


Related Post