భారతీయులైతే చైనా వస్తువులను కొనకండి: బాబా

July 26, 2017


img

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ భారత్-చైనా మద్య నెలకొన్న సైనిక ప్రతిష్టంభన గురించి మీడియాతో మాట్లాడుతూ, “ఈ సమస్యకు చాలా సులువైన పరిష్కారం ఉంది. భారతీయులు అందరూ చైనా వస్తువులను కొనడం మానుకొంటే చైనా వెంటనే దిగివస్తుంది. మనం చైనా మీద ఆధారపడి లేము. చైనాయే మనమీద ఆధారపడి ఉంది. కనుక మన దేశాన్ని ఇబ్బంది పెడుతున్నా చైనాను కట్టడి చేయాలంటే దానితో మనం యుద్ధం చేయనక్కరలేదు. మన సైనికులు రక్తం బొట్టు చిందించనక్కరలేదు. చైనా మొబైల్స్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు వంటివాటిని మనం కొనడం మానేస్తే చైనా తప్పకుండా దిగివస్తుంది. మనం నిజమైన భారతీయులమని నిరూపించుకోవలసిన సమయం ఇదే,” అని బాబా ప్రజలకు పిలుపునిచ్చారు. 

 బాబా రాందేవ్ చెప్పింది నూటికి నూరు శాతం నిజమేనని మనందరికీ తెలుసు. మనం చైనా వస్తువులను కొనడం మానేస్తే వాటిని తయారుచేసే సంస్థలు, వాటిని భారత్ కు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు. కనుక వారు తమ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా ఊరుకోరు. ఒకవేళ వారిని ప్రభుత్వం పట్టించుకోకపోయినా చైనా వస్తువుల కొనుగోళ్ళు నిలిచిపోతే ఆ దేశానికి ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతుంది. కనుక అందువలనైనా చైనా సిక్కిం నుంచి వెనక్కు తగ్గవచ్చు. చైనాతో ప్రత్యక్ష యుద్ధం చేసి చేజేతులా వినాశనం కావడం కంటే చైనా వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా దానిని సులువుగా జయించవచ్చు. చైనా వస్తువులు కొనడం మానుకోమని ప్రభుత్వం కోరితే దౌత్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ప్రజలే పరిస్థితులు అర్ధం చేసుకొని చైనా వస్తువులు కొనుగోలు చేయడం మానుకొని ప్రభుత్వానికి సహాయపడాలి. బీ ఇండియన్ బై ఇండియన్! 


Related Post